కులకచర్ల, జూన్ 4 : ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని టీఎస్ యూటీఎఫ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బాడీడు పిల్లల్ని ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని, నాణ్యమైన విద్య పొందాలని, ఫీజుల భారం తగ్గించుకుందాం అనే సంకల్పంతో టీఎస్ యూటీఎఫ్ వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెండో రోజు బుధవారం మధ్యాహ్నం కులకచర్ల మండలానికి చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని సూచించారు.
రాష్ట్రంలో ప్రైవేటు విద్యా వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగుతుందని వెంకటరత్నం అన్నారు. పిల్లలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఆకాంక్షతో తల్లిదండ్రులు ప్రైవేటు బడులవైపు మొగ్గుచూపుతున్నారని తెలిపారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు విద్యాసంస్థలు సొమ్ముచేసుకుంటున్నాయని అన్నారు. చదువుల నాణ్యతలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని సర్వేలు వెల్లడించాయని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేటు విద్యా వ్యవస్థలు మభ్యపెడుతున్నాయని, ప్రభుత్వ బడి మూతపడితే సమాజానికి నష్టమని అన్నారు.
కులకచర్ల మండల అధ్యక్షులు రమేశ్ మాట్లాడుతూ.. టీఎస్ యూటీఎఫ్ అనేక పోరాటాలు నిర్వహించిందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించారని తెలిపారు.