Village Plants | కులకచర్ల, ఏప్రిల్ 16 : బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సీఎం ప్రతీ గ్రామంలో పల్లె ప్రకృతి వనాలను, డంపింగ్ యార్డులను, వైకుంఠదామాలను ఏర్పాటు చేసింది. అప్పట్లో వీటి నిర్వహణ ఉద్యమంగా చేశారు. ప్రతి చెట్టుకు నీటిని అందించడంతో పాటు వాటి నిర్వహణ చాలా బాగుండేది. కానీ నేడు పల్లె ప్రకృతి వనాలపై, క్రిమటోరియంలలో నాటిన మొక్కలపైన నేటి ప్రభుత్వం దృష్టి పెట్టక పోవడంతో అవి ఎండకు ఎండిపోతున్నాయి.
ఎండాకాలంలో వాటికి నీటిని అందిస్తే వర్షాకాలంలో వాటికి నీటిని అందించాల్సిన అవసరం ఉండదు. కానీ ఎండాకాలంలో గ్రామ పంచాయతీల ద్వారా ఏర్పాటు చేసిన ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాల్సి ఉంటుంది. కానీ చాలా గ్రామ పంచాయతీల్లో ట్యాంకర్లు నిరూపయోగంగా ఉన్నాయి. వాటిని నిర్వహించేందుకు డబ్బులు లేవని ప్రభుత్వం ద్వారా నిర్వహణ నిధులు రావడం లేదని గ్రామ పంచాయతీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. గ్రామాల్లో తాగునీటిని అందించేందుకు ఇబ్బంది పడుతున్నామని, ఇక మొక్కల సంరక్షణ ఎలా చేయగలం అని వారు బహిరంగంగానే చెబుతున్నారు.
ఏమి చేయలేమంటున్న పంచాయతీ కార్యదర్శులు
గతంలో ఏర్పాటు చేసిన మొక్కలకు నీటిని అందించక, వాటిని పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో చెట్లు ఎండిపోతున్నాయి. మొక్కలకు ప్రతీ రోజు లేదా రెండు రోజులకు ఒకసారి నీటిని అందించాల్సి ఉండగా గ్రామ పంచాయతీ సిబ్బందికాని, పంచాయతీ కార్యదర్శులు కానీ అసలు వాటికి నీటిని అందించిన పాపాన పోవడం లేదు.
నీటి కొరత ఉంది, నిధుల కొరత ఉంది తాము ఏమి చేయలేమని పంచాయతీ కార్యదర్శులు తెలియజేస్తున్నారు. గతంలో పంచాయతీలకు సర్పంచులు ఉండేవారు. నేడు అధికారుల పాలనతో గ్రామ పంచాయతీలకు గ్రహణం ఏర్పడటం వలన గ్రామాల్లో పచ్చని చెట్లు ఎండిపోతున్నాయి. దీనికిగాను గ్రామ పంచాయతీలకు నిధులు రాక పోవడంతోనే తాము చేతి నుండి డబ్బులు పెట్టుకోవాల్సిన పరీస్థితి ఉందని పంచాయతీ కార్యదర్శులు తెలియజేస్తున్నారు. దీంతోపాటు పంచాయతీ గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా ఉన్న అధికారులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు.
బోట్యనాయక్ తండాలో మొక్కలకు నిప్పు..
కులకచర్ల మండల పరిధిలోని బోట్యనాయక్తండా గ్రామ పంచాయతీ పరిధిలోని వైకుంఠధామంలో ఏర్పాటు చేసిన మొక్కలకు నీరు అందించక ఎండిపోవడంతో వాటిని అంటిపెట్టారు. ప్రభుత్వం వేల రూపాయల నిధులు పెట్టి నాటిన మొక్కలు పెద్దగా అయిన తరువాత కూడా నీటిని అందించక ఎండిపోతుండటంతో వాటిని అంటిపెట్టారు. దీనిపైన పంచాయతీ అధికారులు పట్టించుకోక పోవడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి హరితహారం ద్వారా పల్లె ప్రకృతివనాలు, వైకుంఠదామాల్లో, గ్రామ పంచాయతీల్లో నాటిన మొక్కలకు నీటిని అందించి వాటిని సంరక్షించాలని పలువురు కోరుతున్నారు.
BRS dharna | జూరాల ఆయికట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలి బీఆర్ఎస్ ధర్నా
Srinivas Goud | బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్