Maoist Devji : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి (Thippari Thirupati) అలియాస్ దేవ్‌జీ (Devji) మంగళవారం తెలంగాణ డీజీపీ (Telangana DGP) శివధర్‌రెడ్డి (Shivadhar Reddy) ఎదుట లొంగిపోయారు. ఆయనతోపాటు మరో ముగ్గురు కీలక నేతలు బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డి కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు. ఈ మేరకు డీజీపీ శివధర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
గడిచిన రెండేళ్లలో నలుగురు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు, 16 మంది స్టేట్ కమిటీ సభ్యులు, 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు, సెక్రటరీలు, 85 మంది ఏరియా కమిటీ సెక్రెటరీలు, 60 మంది పార్టీ సభ్యులు సహా మొత్తం 591 మంది జనజీవన స్రవంతిలోకి వచ్చారని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో పుట్టి పెరిగిన 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని చెప్పారు. వాళ్లలో కొంతమంది తమతో చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే వారు కూడా బయటకు వస్తారని తెలిపారు.
లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రివార్డులు, పునరావాస ప్రయోజనాలను వెంటనే అందిస్తామని దేవ్‌జీ చెప్పారు. మావోయిస్టుల లొంగుబాటులో కీలకంగా వ్యవహరించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ ఐజీ సుమతికి, ఆమె టీమ్‌నకు డీజీపీ అభినందనలు తెలియజేశారు. ఐడీజీ ఇంటెలిజెన్స్ విజయ్‌కుమార్‌ను కూడా అభినందించారు. ఈ సందర్భంగా దేవ్‌జీ, బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డిల స్వస్థలం, విద్యాభ్యాసం, మావోయిస్టులుగా వారి ప్రయాణాన్ని డీజీపీ వివరించారు. జన జీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టుల హక్కులను కాపాడేందుకు ప్రయత్నిస్తామని, అవసరమైతే వారి ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డు వేస్తామని డీజీపీ అన్నారు.
ఇవాళ లొంగిపోయిన మావోయిస్టులలో కేంద్ర కమిటీ సభ్యులైన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున నగదు బహుమతి ఇవ్వనుంది. ఇక స్టేట్ కమిటీ సభ్యులైన బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్నలకు రూ.20 లక్షల చొప్పున నగదు అందజేయనున్నది. అయితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పునరావాస పథకం ప్రకారం.. వారికి లభించే మొత్తం రూ.90 లక్షలు ఉండనుంది. ఈ నగదును డిమాండ్ డ్రాప్టులు, చెక్కుల రూపంలో చెల్లించనున్నారు. ఇతర సభ్యులకు కూడా వారివారి హోదాలను బట్టి నగదు అందించనున్నారు.