చెన్నై: ఐదేళ్లలో మూడుసార్లు నీట్ పేపర్ లీకైందని తమిళనాడుకు చెందిన మాజీ బీజేపీ నేత కే అన్నామలై ఆరోపించారు. అయినప్పటికీ ఎవరికీ జవాబుదారీతనం లేదని ఆయన విమర్శించారు. (K Annamalai) విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ దేశవ్యాప్తంగా భారీ నిరసనలు వెల్లువెత్తడంపై అన్నామలై స్పందించారు. ఎక్స్‌లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. ఈ వైద్య ప్రవేశ పరీక్ష భారతదేశం అంతటా ఏకరూపతను తీసుకువస్తుందని, పేద వర్గాల విద్యార్థులకు వైద్యులు అయ్యే అవకాశం కల్పిస్తుందని తాను విశ్వసించడంతో నీట్‌కు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. అయితే గత ఐదేళ్లలో నీట్ యూజీ ప్రశ్నాపత్రం మూడుసార్లు లీక్ అయ్యిందని గుర్తు చేశారు. అయినప్పటికీ ఎటువంటి బాధ్యతాయుతమైన చర్యలూ తీసుకోలేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దీనివల్ల విద్యార్థుల దృక్పథంలో మార్పు వచ్చిందని, తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి వారు రోడ్లపైకి వచ్చారని పేర్కొన్నారు.
కాగా, ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ఒక ప్రాథమిక హక్కు అని అన్నామలై స్పష్టం చేశారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారేంత వరకు నిరసనకారులతో చర్చలు జరపడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేసిందని ఆయన ప్రశ్నించారు. అలాగే స్వార్థ ప్రయోజనాలు గల వ్యక్తులు తమ నిరసనలను హైజాక్ చేయకుండా నిరోధించాల్సిన బాధ్యత విద్యార్థులకు, వారి నాయకులకు ఉందన్నారు.
మరోవైపు విద్యార్థుల ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అర్థవంతమైన చర్చలు జరుపాలని, పారదర్శకతను పాటించాలని అన్నామలై కోరారు. ప్రభుత్వం త్వరితగతిన తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.