Donald Trump : అమెరికా-ఇరాన్ యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లే ఏ నౌకపైన అయినా ఇరాన్ దాడికి దిగితే.. ఇరాన్‌లోని బ్రిడ్జిలు, పవర్ ప్లాంట్లను పేల్చేస్తామని హెచ్చరించారు. అందులోనూ ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుంటామని చెప్పారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా బుధవారం ప్రకటన చేశారు.
ఇరాన్ ఎలాంటి క్షిపణి, డ్రోన్, రాకెట్ దాడికి దిగినా.. ఎలాంటి ఆయుధాలు ప్రయోగించినా అమెరికా భారీ దాడి చేస్తుందని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు వారితో పెద్దగా సంబంధాలు లేవని ట్రంప్ తెలిపారు. అయితే, చాలా తక్కువ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఇరాన్ వైఖరిపై అమెరికా రక్షణశాఖ సెక్రెటరీ, జాతీయ భద్రతా సలహాదారు మార్కో రూబియో స్పందించారు. ఇరాన్‌కు చిత్తశుద్ధి లేదని, ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండటంలో విఫలమైందని విమర్శించారు. మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతోంది.
ఇరాన్‌పై మంగళవారం, 11వ రోజు వరుసగా అమెరికా దాడి చేసింది. బుషర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, లారక్ ఐలాండ్, హార్ముజ్ జలసంధి, తాబ్రిజ్, చాబహర్లపై అమెరికా దాడులకు దిగింది. ఇరాన్ కూడా ఇతర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. జోర్డాన్, బహ్రెయిన్‌లోని సైనిక స్థావరాలపై దాడి చేసింది. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా చమురు ధరలు వరుసగా పెరుగుతున్నాయి.