Tick | వసంతకాలంలో వాతావరణం వెచ్చగా మారడంతో చాలా మంది బయట ఎక్కువ సమయం గడుపుతుంటారు. అయితే ఇదే సమయంలో లైమ్ వ్యాధిని వ్యాప్తి చేసే టిక్స్ (Ticks) అనే చిన్న పరాన్నజీవుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇవి కుట్టిన విషయం చాలామందికి తెలియకపోవచ్చు. కానీ సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఈ ఇన్ఫెక్షన్ కీళ్లు, గుండె, నాడీ వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లైమ్ వ్యాధికి బొరేలియా (Borrelia) నే కారణం. ముఖ్యంగా బొరేలియా బర్గ్డార్ఫెరి అనే జాతి ఈ వ్యాధిని కలిగిస్తుంది. ఈ బ్యాక్టీరియా జింకలు, ఎలుకలు, పక్షులు వంటి జంతువులపై జీవించే బ్లాక్-లెగ్డ్ టిక్స్ లేదా డీర్ టిక్స్ ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. బ్యాక్టీరియా సోకిన జంతువును కుట్టిన టిక్, తర్వాత మనిషిని కుట్టినప్పుడు ఈ బ్యాక్టీరియా రక్తంలోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా టిక్ కనీసం 24 నుంచి 48 గంటల పాటు చర్మానికి అంటుకుని ఉంటేనే వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
టిక్స్ ఎక్కువగా వసంతకాలం చివరి నుంచి వేసవి, శరదృతువుల వరకు చురుకుగా ఉంటాయి. సాధారణంగా ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు వీటి చురుకుదనం ఎక్కువగా కనిపిస్తుంది. చలికాలం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో లేదా ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి దిగని ప్రాంతాల్లో ఇవి దాదాపు ఏడాది పొడవునా కనిపించే అవకాశం ఉంటుంది. వాతావరణ మార్పులు, వర్షపాతం తీరులో మార్పులు, అడవుల్లో మానవ జోక్యం పెరగడం వల్ల టిక్స్ కొత్త ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. లైమ్ వ్యాధి ప్రారంభ లక్షణాలు సాధారణంగా టిక్ కుట్టిన మూడు నుంచి 30 రోజులలోపు కనిపిస్తాయి. జ్వరం, కండరాల నొప్పులు, తీవ్ర అలసట మొదటి లక్షణాలుగా ఉంటాయి. అలాగే టిక్ కుట్టిన చోట లక్ష్యాన్ని పోలి ఉండే గుండ్రని ఎర్రని దద్దుర్లు (బుల్స్-ఐ ర్యాష్) కనిపించడం ఈ వ్యాధికి ప్రధాన లక్షణంగా పరిగణిస్తారు. అయితే ప్రతి ఒక్కరిలో ఈ దద్దుర్లు కనిపించవు. కొన్నిసార్లు టిక్ కాటు వల్ల సాధారణ చర్మ చికాకు కూడా వస్తుంది.
టిక్ కుట్టినట్లు తెలిసి ఫ్లూ లాంటి లక్షణాలు కనిపించినా, లేదా బుల్స్-ఐ దద్దుర్లు వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. రక్తంలో యాంటీబాడీలను గుర్తించే పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు. అయితే వ్యాధి ప్రారంభ దశలో ఈ పరీక్షల్లో కొన్నిసార్లు తప్పుడు నెగెటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల లక్షణాల ఆధారంగానే వైద్యులు చికిత్స ప్రారంభించవచ్చు. లైమ్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే సాధారణంగా రెండు నుంచి నాలుగు వారాలపాటు యాంటీబయోటిక్స్‌తో చికిత్స చేసి పూర్తిగా నయం చేయవచ్చు. తీవ్రమైన పరిస్థితుల్లో శిరామార్గం ద్వారా యాంటీబయోటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ వ్యాధిని నివారించేందుకు ఒక కొత్త వ్యాక్సిన్‌పై కూడా పరిశోధనలు కొనసాగుతున్నాయి. తాజా క్లినికల్ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ సుమారు 70 శాతం వరకు రక్షణ కల్పించినట్లు వెల్లడైంది.
చికిత్స తీసుకోకుండా వదిలేస్తే బ్యాక్టీరియా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించి దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది. చికిత్స తీసుకోని వారిలో దాదాపు 60 శాతం మందికి కీళ్ల వాపు (ఆర్థ్రైటిస్) వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అరుదుగా గుండె, మెదడు, నాడీ వ్యవస్థ కూడా ప్రభావితమవుతాయి. తీవ్రమైన తలనొప్పి, మెడ నొప్పి, సమతుల్యత కోల్పోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం, చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, కండరాల బలహీనత వంటి లక్షణాలు నెలలు లేదా సంవత్సరాల తర్వాత కూడా కనిపిస్తాయి. కొందరిలో యాంటీబయోటిక్స్‌తో బ్యాక్టీరియా నశించిన తర్వాత కూడా శరీరంలో మిగిలే వాపు కారణంగా కొన్ని లక్షణాలు కొనసాగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. లైమ్ వ్యాధి నుంచి రక్షణ పొందేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. బయటకు వెళ్లేటప్పుడు DEET లేదా పికారిడిన్ కలిగిన టిక్ నిరోధక ద్రావణాలను చర్మానికి, పెర్మెత్రిన్ను దుస్తులకు ఉపయోగించాలి. తోటపని, ట్రెక్కింగ్, అడవుల్లో లేదా గడ్డి ప్రాంతాల్లో తిరిగేటప్పుడు పూర్తి చేతులున్న చొక్కాలు, పొడవాటి ప్యాంట్లు ధరించడం మంచిది. లేత రంగు దుస్తులు వేసుకుంటే టిక్స్‌ను సులభంగా గుర్తించవచ్చు. ప్యాంట్ చివరలలో సాక్సుల్లో పెట్టుకోవడం కూడా టిక్స్ శరీరంపైకి ఎక్కకుండా సహాయపడుతుంది.
బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే దుస్తులు మార్చి, వేడి నీటితో ఉతకడం, అధిక ఉష్ణోగ్రతలో ఆరబెట్టడం మంచిది. అలాగే వీలైనంత త్వరగా స్నానం చేయడం వల్ల చర్మంపై ఉన్న టిక్స్ అంటుకునేలోపే తొలగిపోతాయి. ప్రతిరోజూ బయటకు వెళ్లి వచ్చిన తర్వాత చంకలు, మెడ, చెవుల వెనుక భాగం, నడుము, లోదుస్తుల అంచులు వంటి వేడి ప్రాంతాలను జాగ్రత్తగా పరిశీలించాలి. చర్మానికి టిక్ అంటుకున్నట్లు కనిపిస్తే దానిని చేతులతో నలపకుండా ట్వీజర్స్ సహాయంతో చర్మానికి నిటారుగా పట్టుకుని మెల్లగా బయటకు తీయాలి. టిక్ 36 గంటలకు పైగా చర్మానికి అంటుకుని ఉండి ఉంటుందని అనుమానం ఉంటే, కాటు వేసిన 72 గంటల్లోపు వైద్యులను సంప్రదించి నివారణ కోసం యాంటీ బయోటిక్స్ అవసరమా అనే విషయాన్ని తెలుసుకోవడం మంచిది.