బూర్గంపహాడ్, సెప్టెంబర్ 25 : బూర్గంపహాడ్ మండలం పారిశ్రామికవాడ సారపాకలో ఐటీసీ పీఎస్పీడీలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు, కార్మికుల కుటుంబాల వైద్య సేవల కోసం నిర్వహిస్తున్న ఈఎస్ఐ ఆస్పత్రికి భవనం యజమాని తాళం వేశాడు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సారపాకలో అద్దె భవనంలో నిర్వహిస్తున్న ఈఎస్ఐ ఆస్పత్రికి చెల్లించాల్సిన అద్దె 15 నెలలుగా చెల్లించకపోవడంతో ఇంటి యజమాని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి భవనానికి తాళం వేశాడు. దీంతో మందుల కోసం వచ్చిన కార్మికులు, కార్మికుల కుటుంబ సభ్యుల వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. బకాయిల సమస్యను ముందుగా పరిష్కరించక పోవడంతో కార్మికులు ఇలా వైద్య సేవల కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసర వైద్యం సమయంలో ఇలా ఆస్పత్రి మూసివేస్తే తమ పరిస్థితి ఏమిటని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్పత్రికి తాళం వేసి ఉండడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు అక్కడే నిరీక్షించారు. ఈఎస్ఐ ఆస్పత్రి భవనానికి తాళం వేసిన విషయాన్ని ఆస్పత్రి వైద్యుడు చందు వరంగల్లోని జాయింట్ డైరెక్టర్ హేమలతకు వివరించగా ఆమె ఆస్పత్రి భవన యజమానితో మాట్లాడి గత ఏడాది జూలై నుండి ఉన్న అద్దె బకాయిని త్వరలోనే చెల్లిస్తామని, ప్రాసెస్ జరుగుతుందని చెప్పడంతో కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ యజమాని తాళం తీయడంతో తిరిగి వైద్యసేవలు పునరుద్ధరించారు. ఇదిలా ఉండగా అద్దె భవనాల నుండి ప్రభుత్వ భవనాల్లోకి ఆస్పత్రిని తరలించాలని ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ ఇక్కడ ప్రభుత్వ భవనాలు ఖాళీ లేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతుందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.