తుర్కయాంజాల్, ఏప్రిల్ 12 : ఇంటి నంబర్ కేటాయింపు, ట్యాక్స్ అసెస్మెంట్ విషయంలో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం.. తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ బిల్ కలెక్టర్‌గా భీమగౌని నరేశ్‌గౌడ్ మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ప్రైవేట్ ఉద్యోగి అయిన హర్షవర్ధన్‌రెడ్డికి తుర్కయాంజాల్ పరిధిలో ఓపెన్ ప్లాట్ ఉంది. తనకు ఇంటి నంబర్, ట్యాక్స్ అసెస్మెంట్ చేయాలని బిల్ కలెక్టర్ నరేశ్‌గౌడ్‌ను సంప్రదించాడు. ఇందుకు బిల్ కలెక్టర్ రూ.20వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం హర్షవర్ధన్‌రెడ్డి నుంచి బిల్ కలెక్టర్ రూ.20వేలు లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో అధికారులు పట్టుకున్నారు.
అతడి నుంచి రూ.20వేలు స్వాధీనం చేసుకున్న అధికారులు కార్యాలయంలోనే విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. నరేశ్‌గౌడ్ తన పై అధికారుల పేరు చెప్పకపోవడం కొసమెరుపు. పంచనామా నిర్వహించాక ఏసీబీ కోర్టులో హాజరుపరిచి అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు. అవినీతిని శాశ్వతంగా నిర్మూలించాలంటే ప్రజలు తమకు సహకరించాలని, అధికారులు లంచం అడిగితే నిర్భయంగా బాధితులు తమకు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ సూచించారు. ప్రజలు చైతన్యవంతమైతేనే సమాజంలో మార్పు వస్తుందన్నారు.