Hardeep Singh Puri : ఎప్స్టీన్ ఫైల్స్ అంశంలో తన పేరు రావడం, వాటిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. రాహుల్ గాంధీవి నిరాధారమైన ఆరోపణలు అని తోసిపుచ్చారు. బడ్జెట్‌పై ప్రసంగం సందర్భంగా రాహుల్ పార్లమెంట్లో మాట్లాడుతూ.. ఎప్స్టీన్ ఫైల్స్‌లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు ఉందని ప్రస్తావించారు.
హర్దీప్తోపాటు అదానీ, అనిల్ అంబానీ పేర్లు ఉన్న విషయాన్ని కూడా రాహుల్ ప్రస్తావించారు. ఈ అంశంపై హర్దీప్ సింగ్ పూరి మీడియాతో మాట్లాడారు. తన వివరణ ఇచ్చారు. తాను ఎప్స్టీన్ను కలిసిన మాట వాస్తవమే అని, అయితే, ఆయన చేసిన నేరాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘‘ఇంటర్నేషనల్ పీస్ ఇనిస్టిట్యూట్ (ఐపీఐ)లో పని చేసినప్పుడు ఎప్స్టీన్ను కలిశాను. ఐపీఐలో మా బాస్ తెజ్రె రాడ్ లార్సెన్‌కు ఎప్స్టీన్ తెలుసు. ఆయన ద్వారా మా సంస్థ చర్చల సందర్భంగా ఎప్స్టీన్ను మూడు, నాలుగు సార్లు కలిశాను. మా మధ్య జరిగిన సంభాషణకు, ఆయన చేసిన నేరాలకు సంబంధం లేదు. 2009 నుంచి జరిగిన అంశాలపై ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజయ్యాయి. 2017లో నేను కేంద్ర మంత్రిగా చేరేంతవరకు న్యూయార్క్‌లో ఇండియాకు ప్రతినిధిగా పని చేశాను.
ఇన్నేళ్లకాలంలో ఎప్స్టీన్ను కలిసింది మూడు నాలుగుసార్లు మాత్రమే. పూర్తి వృత్తిపరమైన అంశాల్లోనే ఆయనను కలిశాను. ఎనిమిదేళ్ల కాలంలో రెండే మెయిల్స్ చేసుకున్నాం. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి నిరాధారమైన ఆరోపణలు చేయడం అలవాటు. ఎప్స్టీన్ చేసిన నేరాలకు నాకు సంబంధం లేదు. అలాంటివాటికి నేను తగినవాడిని కాదు’’ అంటూ హర్దీప్ సింగ్ పూరి వివరణ ఇచ్చారు.