జడ్చర్లటౌన్, జూలై 25 : కార్పొరేషన్ చైర్మన్లను మారిస్తే రెండేండ్ల పదవీకాలం పూర్తయిన మంత్రులను కూడా మార్చాలని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో అగ్నిమాపకశాఖ నూతన భవన నిర్మాణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేసి మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించిన వారు, ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా ఉన్న వారే కార్పొరేషన్ల చైర్మన్లుగా ఉన్నందున వారినే కొనసాగించాలి’ అని వ్యాఖ్యానించారు. ఒక వేళ కార్పొరేషన్ల చైర్మన్లను మారిస్తే రెండేండ్ల పదవీకాలం పూర్తయిన మంత్రులను కూడా మార్చి యువ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని పేర్కొన్నారు. యువ ఎమ్మెల్యేలు ఇంజినీరింగ్ చదువుకున్నోళ్లు, డాక్టర్లు ఉన్నారని, వారికి మంత్రి పదవులిస్తే బాగా పనిచేసే అవకాశం ఉన్నదని సూచించారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్, ఇన్చార్జి మీనాక్షి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పారు.