హైదరాబాద్, జూలై 25(నమస్తే తెలంగాణ) : ‘దేశమే మీ తొలి ప్రాధాన్యత అయితే ధర్మేంద్ర ప్రధాన్ కన్నా ముందు మీరు రాజీనామా చేయాల్సింది.. మీ కుమారుడి పోక్సో కేసుకు బాధ్యత వహించి పదవి నుంచి ఎందుకు తప్పుకోలేదు’ అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను నెటిజన్లు నిలదీస్తున్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థుల ఆందోళనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగా.. ఆ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ శనివారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘
నేషన్ ఫస్ట్, పార్టీ నెక్ట్స్, సెల్ఫ్ లాస్ట్.. మా పార్టీ విధానం.. ప్రజల ఆకాంక్షల మేరకు నడువడమే ప్రజాస్వామ్యం. పదవులు తాత్కాలికం, ప్రజల విశ్వాసమే అంతిమం. ప్రజల గొంతు వినడం, వారి మాటలను గౌరవించడం.. అవసరమైతే బాధ్యత తీసుకొనే ధైర్యాన్ని కలిగి ఉండటం. ఇదే సిద్ధాంతాన్ని బీజేపీ పాటిస్తుంది.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. పార్టీ విలువలను ప్రతిబింబిస్తున్నది.’ అని బండి ట్వీట్ చేశారు. బండి సంజయ్ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. నీతిసూత్రాలు చెప్పే ముందు వాటిని ఆచరించాలంటూ చరకలంటిస్తున్నారు.
‘మీ కుమారుడి పొక్సో కేసుకు బాధ్యత వహిస్తూ మీరు రాజీనామా చేయండి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దాదాపు నెల రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిద్రపోయిందా? ఇప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా’ అని ప్రశ్నిస్తున్నారు.
‘నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్ అని ఇతరులకు ఉపన్యాసాలు ఇవ్వడం కన్నా ముందు కుమారుడి పొక్సో కేసులో జవాబుదారీతనం ఎక్కడుందో చెప్పాలి?’ అని నిలదీస్తున్నారు. ‘మీరు కూడా రాజీనామా చేసి ధర్మేంద్ర ప్రధాన్లా అందరికీ ఆదర్శంగా నిలువాలి’ అని డిమాండ్ చేస్తున్నారు. ‘రాజీనామా విషయంలో మీకు మినహాయింపు దొరికింది అనుకుంటా..’ అని దొప్పిపొడుస్తున్నారు. ‘విద్యార్థులను అరాచకవాదులని, వారి ఆందోళన వెనుక పాకిస్థాన్ హస్తమున్నది.. అన్ని రాష్ర్టాల్లో పేపర్లు లీక్ అయ్యాయి.. అని చెప్పి ఇప్పుడు నీతి వ్యాఖ్యలేంటీ? అని నెటిజన్లు నిప్పులుచెరుగుతున్నారు.