US trade deal : భారత్‌తో ట్రేడ్ డీల్ కుదిరిన నేపథ్యంలో అమెరికా చేసిన ఒక పని ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇండియాతో ట్రేడ్ డీల్‌కు సంబంధించిన వివరాలు పంచుకుంటూ ఒక ఇండియా మ్యాప్‌ను అమెరికా ప్రచురించింది. అందులో వివాదాస్పద ప్రాంతాలైన పాక్ ఆక్రమిత కాశ్మీర్, అక్సాయ్ చిన్ వంటి ప్రాంతాలున్నాయి. ఈ మేరకు అమెరికా వాణిజ్య విభాగం (యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజంటేటివ్) ఒక ట్వీట్ ద్వారా ఈ మ్యాప్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది.
అయితే, తర్వాత ఈ మ్యాప్‌ను డిలీట్ చేసింది. ఈ నెల 7న చేసిన పోస్టులో ఇండియా మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కాశ్మీర్, అక్సాయ్ చిన్ ఉన్నాయి. ఇందులో ఒక ప్రాంతాన్ని పాక్ తమ సొంతం అని వాదిస్తుండగా, రెండో ప్రాంతం విషయంలో ఇండియాకు-చైనాకు మధ్య వివాదం నడుస్తోంది. కానీ, ఈ రెండు ప్రాంతాలు పూర్తిగా ఇండియావే అని మన దేశం ఎప్పటినుంచో చెబుతోంది. అక్సాయ్ చిన్ ఇండియాలోనే ఉన్నప్పటికీ.. చైనా కూడా ఆ ప్రాంతాలను తమవే అని క్లెయిమ్ చేసుకుంటోంది. దీనిపై భారత్ ఎప్పటినుంచో చైనాపై విమర్శలు చేస్తూ వస్తోంది. అలాంటి వివాదాస్పద ప్రాంతాలను అమెరికా ప్రచురించడం ఆసక్తి కలిగిస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో ఇండియాకు అమెరికా మద్దతు ఇస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే చైనాతో కూడా అమెరికా ఈమధ్య కాలంలో ఎక్కువగా విబేధిస్తోంది. అందుకే అక్సాయ్ చిన్ విషయంలో తన మద్దతు ఇండియాకే అని అమెరికా స్పష్టం చేసిందా..? ముందు అమెరికా పోస్టు చేసి, తర్వాత డిలీట్ చేసినప్పటికీ ప్రస్తుతం ఈ అంశంపై చర్చ జరుగుతోంది. అయితే, వివాదాస్పద ప్రాంతాల విషయంలో ఈ చర్య భౌగోళిక రాజకీయ ఆమోదం అని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు.