Cashew Nuts | జీడిపప్పు గురించి మాట్లాడేటప్పుడు చాలామంది అందులో ఫైబర్ తక్కువగా ఉంటుందని, దానిని తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని భావిస్తుంటారు. కానీ వాస్తవానికి జీడిపప్పు అనేక పోషక విలువలతో నిండి ఉంటుంది. వెన్నలాంటి మృదువైన రుచి కలిగిన ఈ గింజలు బ్రెజిల్లో పుట్టి, తర్వాత భారతీయ వంటకాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. నెయ్యిలో వేయించి, ఉప్పు కలిపి తిన్నా, పచ్చిగా తీసుకున్నా జీడిపప్పు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే మితంగా తీసుకోవడం తప్పనిసరి. జీడిపప్పుతోపాటు జీడిపండు కూడా అనేక పోషకాలను అందిస్తుంది. ఒక ఔన్స్ (సుమారు 28 గ్రాములు) పచ్చి జీడిపప్పులో సుమారు 155 కేలరీలు, 9.2 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 5.1 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. అలాగే విటమిన్ ఇ, విటమిన్ బి6 స్వల్ప మోతాదులో లభిస్తాయి. విటమిన్ కె, కాల్షియంతో పాటు జింక్, మెగ్నిషియం, కాపర్, ఫాస్ఫరస్, ఫోలిక్ యాసిడ్ వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి.
జీడిపప్పులో ఉండే ఆరోగ్యకరమైన మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, డి, ఇ, కె వంటి కొవ్వులో కరిగే విటమిన్ల శోషణకు సహాయపడతాయి. పరిమిత మోతాదులో తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో తోడ్పడే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. దీంతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉపయోగకరంగా ఉంటాయి. జీడిపప్పును క్రమం తప్పకుండా మితంగా తీసుకోవడం వల్ల రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో కాపర్ లోపం ఏర్పడితే ఇనుము వినియోగం సరిగా జరగక రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. జీడిపప్పులో కాపర్ సమృద్ధిగా ఉండటం వల్ల ఈ లోపాన్ని నివారించడంలో దోహదపడుతుంది. క్యారెట్ కళ్లకు మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. అయితే జీడిపప్పు కూడా కంటి ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే జియాజాంతిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ రెటీనాపై రక్షణ పొర ఏర్పరచి, సూర్యకిరణాలు, కాలుష్యం వల్ల కలిగే నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
జీడిపప్పు నుంచి తీసే నూనె చర్మ సంరక్షణలో కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే జింక్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, ఇనుము వంటి ఖనిజాలు చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది తోడ్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. జీడిపప్పులో కేలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, సరైన మోతాదులో తీసుకుంటే బరువు నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. జంతు కొవ్వులు, ప్రోటీన్లకు బదులుగా జీడిపప్పు వంటి వృక్షాధార ఆహారాలను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం తగ్గే అవకాశం ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇందులో ఉండే ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయని పేర్కొంటున్నారు. అయితే జీడిపప్పును పచ్చిగా, ఉప్పు కలపకుండా తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని సూచిస్తున్నారు. జీడిపప్పును తినడం లేదా జీడినూనెను ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఇందులో ఉండే కాపర్ మెలనిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీంతో జుట్టు రంగు, కుదుళ్ల బలం, మెరుపు మెరుగుపడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.