వికారాబాద్, నవంబర్ 20 : రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే ఫార్ములా ఈ రేస్ కేసు అని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఉన్నట్టుండి ఫార్ములా ఈ రేస్ కేసును తెరపైకి తేవడం ద్వారా కేటీఆర్ని ఇబ్బంది పెట్టి రాక్షసానందం పొందడానికి రేవంత్ సర్కార్ సిద్ధమైందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయంగా లబ్ధి పొందాలని ఇలాంటి డ్రామాలకు తెరలేపిన రేవంత్ రెడ్డిది సరైన పద్ధతి కాదన్నారు.
ఇది కేవలం ఒక రాజకీయ కక్ష సాధింపు చర్య అన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకు కేటీఆర్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రశ్నించిన ప్రతి వారిపై అప్రజాస్వామికంగా పోలీస్ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడమే రేవంత్ లక్ష్యం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ కేసు ఇన్నాళ్లు నిద్రావస్థలో ఎందుకు ఉండిపోయింది అని ప్రశ్నించారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టి ఎలాగైనా బీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తల ధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్న రేవంత్ సర్కార్ అని మండిపడ్డారు. మీరు ఆడే డ్రామాలు రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. త్వరలోనే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.