వికారాబాద్, జులై 31 : కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్లు ప్రజలను మోసం చేసి ఇప్పుడు జనహిత పాదయాత్ర నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను మళ్లీ మభ్యపెట్టి ఎలక్షన్లో లబ్ధి పొందాలనే ప్రయత్నంలో భాగమే ఈ పాదయాత్ర అన్నారు. రాహుల్‌గాంధీ తెలంగాణలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకుని, ఆ సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు.
ఓ వైపు రుణమాఫీ, గిట్టుబాటు ధర, రైతు భరోసాతో పాటు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకలు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కల్తీ లేని ఆహారం కోసం విద్యార్థులు రోడ్ మీదకి వచ్చి పాదయాత్రలు చేస్తున్నారని గుర్తు చేశారు. మంచినీటి కోసం మహిళలు రోడ్డు మీదకు వచ్చి ఖాలీ బిందెలతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారని వివరించారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన మిమ్మల్ని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తరిమి కొట్టి మీకు తగిన గుణపాఠాన్ని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.