కొడంగల్, జూన్ 02 : చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని తిరుమలాపూర్ గ్రామం చెరువులో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రవి గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చిన్నబాయి జైపాల్ (32) తిరుమలాపూర్ గ్రామ శివారులోని చెరువులో చేపలు పట్టేందుకు ఈ నెల 15వ తేదీన తెల్లవారుజామున వెళ్లాడు.
చేపలు పట్టిన తర్వాత ఇంటికి వచ్చి తక్కువగా చేపలు పడ్డాయని మళ్లీ అదే రోజు ఉదయం 7 గంటలకు తిరిగి చేపలు పట్టేందుకు వెళ్లాడు. జైపాల్ ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతుడి భార్య శాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.