వికారాబాద్, మే 22 : ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలి అని వామపక్షాల నాయకలు డిమాండ్ చేశారు. సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా మావోయిస్టుల ఎన్కౌంటర్లను ఖండిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్. మైపాల్, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై. మహేందర్‌లు మాట్లాడుతూ బూటకపు హత్యలు చేసి ఆదివాసీ అమాయక ప్రజలను, మావోయిస్టు నాయకులను ఆపరేషన్ కగార్ పేరుతో హతమారుస్తున్నారని విమర్శించారు.
దేశంలో రాజ్యాంగపు హక్కులను కాల రాస్తున్న బిజెపి ప్రభుత్వం తమ చర్యలను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. మావోయిస్టు జాతీయ కార్యదర్శి కేశవరావును నిరాయుధుడిగా పట్టుకొని కాల్చి చంపి ఎన్కౌంటర్ కథలల్లుతున్నారని, ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అడవి సంపదను ఇతర దేశాలకు తరలించడంలో భాగంగానే అదానీ, అంబానీలకు మూకుమ్మడిగా అడవిని, అడవిలో ఉన్న సంపదలను కట్టబెడుతున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే ఈ నరమేధం జరుగుతుందని పేర్కొన్నారు.
దేశంలో బిజెపి ప్రభుత్వం పాకిస్తాన్ టెర్రరిస్టులతో చర్చలు జరిపి యుద్ధాన్ని విరమించింది కానీ, స్వదేశంలో పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడుతున్న మావోయిస్టులతో చర్చలకు మాత్రం సిద్ధంగా లేదని ఎద్దేవా చేశారు. తక్షణమే వారితో శాంతి చర్చలు జరపాలని, ఆదివాసీల హననాన్ని ఆపాలని, ఇప్పటివరకు జరిగిన బూటకపు ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుదర్శన్, మల్లేష్, యాదయ్య, దశరథ ఆనంద్, ప్రకాష్, నర్సింహులు, పెంటన్న, అనంతయ్య, నాయకులు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.