Hair Fall | జుట్టు ఎక్కువగా ప్రోటీన్ తో తయారవుతుంది. జుట్టు పెరుగుదల చక్కగా ఉండాలన్నా, జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉండాలన్నా పోషకాహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. శరీరంలో అవసరమైన పోషకాల స్థాయిలు తగ్గినప్పుడు శరీరం ఇతర ముఖ్యమైన అవయవాలకు పోషకాలను అందిస్తుంది. ఫలితంగా జుట్టు పెరుగుదల మందగిస్తుంది. జుట్టు రాలడం ఎక్కువవుతుంది. జుట్టు కుదళ్లు బలహీనంగా తయారవుతాయి. జుట్టు పొడిబారడంతో పాటు పెలుసుగా తయారవుతుంది. కనుక జుట్టు సమస్యలతో బాధపడే వారు ముందుగా వారి ఆహారపు అలవాట్లను చూసుకోవడం చాలా ముఖ్యం.
చక్కెర కలిగిన ఆహారాలను, శుద్ది చేసిన పిండితో తయారు చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. హార్మోన్లు అసమతుల్యతకు దారి తీస్తుంది. కాలక్రమేణా ఇది శరీరంలో వాపును పెంచుతుంది. దీంతో జుట్టు కుదుళ్లు బలహీనంగా తయారవుతాయి. కనుక వీటికి బదులుగా ఓట్స్, బ్రౌన్ రైస్, తృణ ధాన్యాలు వంటి వాటిని తీసుకోవాలి. ఫైబర్ కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. బర్గర్లు, ఫ్రైస్, ప్యాక్ చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటిలో ఉప్పు, ఫ్రిజర్వేటివ్స్, అనారోగ్య కొవ్వులు ఉంటాయి. వీటిలో జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే ఎటువంటి పోషకాలు ఉండవు. ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల పోషకాల లోపం తలెత్తుతుంది. దీంతో జుట్టుకు రక్తప్రసరణ సరిగ్గా జరగక జుట్టు వేగంగా రాలిపోతుంది.
అలాగే అధిక పాదరసం కలిగిన స్వోర్డ్ ఫిష్, కింగ్ మాకేరెల్ వంటి చేపలల్లో పాదరసం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జుట్టు పలుచగా మారుతుంది. కనుక తక్కువ పాదరసం కలిగిన సాల్మన్, సార్డిన్స్ వంటి చేపలను తీసుకోవడం మంచిది. విటమిన్ ఎ సప్లిమెంట్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. శరీరంలో విటమిన్ ఎ స్థాయిలను పరీక్షించుకోకుండానే చాలా మంది సస్లిమెంట్స్ ను తీసుకుంటున్నారు. దీంతో జుట్టు కుదుళ్లు విశ్రాంతి దశలోకి వెళ్లి జుట్టు పెరుగుదల తగ్గిపోతుంది. ఆల్కాహాల్ శరీరంపై అన్ని విధాలుగా ప్రభావాన్ని చూపుతుంది. దీని వల్ల జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఆల్కహాల్ శరీరం డీహైడ్రెటెడ్ గా మారేలా చేస్తుంది. జింక్ స్థాయిలను తగ్గిస్తుంది. జింక్ స్థాయిలు తగ్గడం వల్ల జుట్టు కణజాల పెరుగుదల, మరమ్మత్తు కూడా తగ్గుతుంది. దీని వల్ల జుట్టు రాలడం ఎక్కువవుతుంది. కనుక జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు ఆల్కహాల్ కు దూరంగా ఉండడం మంచిది.
కృత్రిమ తీపి పదార్థాలు కొన్ని సార్లు జుట్టు పలచబడడానికి కారణమవుతాయి. కనుక జుట్టు ఎక్కువగా రాలే సమస్యతో బాధపడే వారు కొంతకాలం స్వీటెనర్లను తీసుకోవడం తగ్గించాలి. ఇక ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు ఎక్కువగా రాలుతుంది. జుట్టు కెరాటిన్ అనే ప్రోటీన్ తో తయారవుతుంది. ఆహారంలో ప్రోటీన్ లేకపోవడం వల్ల జుట్టు పెరుగుదల నెమ్మదిస్తుంది. జుట్టు బలహీనంగా మారడం, పలుచబడడం జరుగుతాయి. అధిక క్రాష్ డైట్స్ చేయడం ద్వారా క్యాలరీలను తీసుకోవడం పూర్తిగా తగ్గిస్తారు. దీంతో జుట్టు పెరుగుదల మందగిస్తుంది. జుట్టు రాలడం ఎక్కువవుతుంది. కనుక సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూనే బరువును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల రక్తప్రసరణ సరిగ్గా ఉండదు. దీంతో జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. కనుక ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలతో పాటు ఉప్పును తీసుకోవడం కూడా తగ్గించాలి.
ఈ విధంగా ప్రతి ఒక్కరూ తీసుకునే ఆహారం కూడా మన జుట్టు పెరుగుదలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు సమస్యలతో బాధపడే వారు, జుట్టు పెరుగుదల వేగంగా ఉండే వారు సరైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో ప్రోటీన్, ఐరన్, జింక్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ సి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి. రోజూ 7 గంటల పాటు నిద్రించాలి. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. రసాయనాలు కలిగిన జుట్టు ఉత్పత్తులను వాడకూడదు. ఇలా జుట్టు పెరుగుదలకు కావల్సిన ఆహారాన్ని తీసుకుంటూ, చక్కని జీవనశైలిని పాటించడం వల్ల చక్కని ఆరోగ్యవంతమైన, బలమైన జుట్టును సొంతం చేసుకోవచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు.