పరిగి, ఆగస్టు 29 : పంటలకు సరిపడ యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి విమర్శించారు. యూరియా కోసం రైతాంగం రోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. శుక్రవారం యూరియా కోసం రైతులు పరిగిలోని ఆగ్రోస్ ముందు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టగా మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మద్దతు ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు చూస్తే మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రోజులను తీసుకువచ్చిందని దుయ్యబట్టారు. తెలంగాణ రాకముందు ఎరువులు, విత్తనాల కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టి గంటల తరబడి నిరీక్షించారని, ప్రస్తుతం అదే పరిస్థితి ప్రతిచోట కనిపిస్తుందన్నారు.
ప్రైవేటు డీలర్ల దగ్గర యూరియా లభించడం లేదని, గత పది రోజులుగా రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని యూరియా తెప్పించాలని, ప్రతి ఎకరాకు కనీసం రెండు బస్తాలు యూరియా సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే మరోసారి ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు అడ్డుకున్నారు.