హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి నుంచి వారు సోమవారం ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా వేం నరేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన రాజకీయ ప్రస్థానంలో ఇది ఒక మరుపురాని ఘట్టంగా పేర్కొన్నారు. తనను రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో సహకరించిన వారికి, మద్దతు తెలిపిన సీపీఐ, ఎంఐఎం పార్టీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతానని చెప్పారు. తనను రాజ్యసభకు పంపిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
ఇద్దరూ కోటీశ్వరులే..
రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా అఫిడవిట్లో ఆస్తుల వివరాలు వెల్లడించారు. సింఘ్వీ తన కుటుంబ ఆస్తుల విలువ రూ.2,558 కోట్లుగా వెల్లడించారు. వ్యక్తిగతంగా తనకు ఒక రూపాయి కూడా అప్పులేదని పేరొన్నారు. వ్యక్తిగత చరాస్తుల విలువ రూ.1,536 కోట్లుగా వెల్లడించారు. తన భార్య అనిత పేరిట ఉన్న చరాస్తుల విలువ రూ.568 కోట్లు. హెచ్‌యూఎఫ్ పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.51 లక్షలుగా చూపించారు. వేం నరేందర్ కుటుంబ ఆస్తి రూ.41.5 కోట్లు
మరో సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తన కుటుంబ ఆస్తుల మొత్తం విలువ రూ.41.5 కోట్లుగా వెల్లడించారు. మొత్తం అప్పులు రూ.1.62 కోట్లు ఉన్నాయని తెలిపారు. తన భార్య పేరుతో కేసముద్రంలో 7.33 ఎకరాలు, కుటుంబ ఆస్తి కింద అర్పణపల్లిలో మరో 15.17 ఎకరాల భూమి, తన పేరిట కేసముద్రంలో 1,050 గజాల వ్యవసాయేతర స్థలం ఉందని వెల్లడించారు. దీంతో పాటు హైదరాబాద్, వరంగల్, కేసముద్రంలలో మూడు వాణిజ్య భవనాలు ఉన్నట్టు పేర్కొన్నారు. 2024-25లో తన సంపాదన రూ.22.02 లక్షలు కాగా, భార్య సంపాదన రూ.12.79 లక్షలుగా వెల్లడించారు. తన చేతిలో నగదు రూ.4.99 లక్షలు మాత్రమే ఉందని తెలిపారు.