CV Anand | ములుగు, ఆగస్టు 10: ఒకప్పుడు మావోయిస్టుల ప్రధాన స్థావరంగా పేరు గాంచిన తెలంగాణ–ఛత్తీస్గఢ్–ఒడిశా సరిహద్దులోని కర్రెగుట్ట ఇప్పుడు శాంతి, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సోమవారం కర్రెగుట్టలో పర్యటించిన ఆయన అక్కడ జరుగుతున్న రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, శాంతికి ప్రతీకగా తెల్ల పావురాలను ఎగురవేశారు.
పోలీసు, సీఆర్పీఎఫ్, అటవీ, రెవెన్యూ తదితర శాఖల ఉన్నతాధికారులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించిన డీజీపీ, దశాబ్దాలుగా మావోయిస్టు ప్రభావానికి గురైన ఈ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి బాట పట్టిందన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులు, గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు, సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలు, ఛత్తీస్గఢ్ పోలీసుల సమన్వయం వల్ల ఆపరేషన్ కగార్ చర్యల ఫలితంగానే మావోయిజమంతమైందన్నారు. ఆపరేషన్ కగార్లో సుమారు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని, పలువురు అగ్రనేతలు ఎన్కౌంటర్లలో మృతిచెందగా మరికొందరు సాధారణ జీవితంలోకి వచ్చారని చెప్పారు.
నిబంధనలకు అనుగుణంగా పర్యాటక కేంద్రంగా..
లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి ప్రభుత్వం ఆర్థిక సాయం, భూముల కేటాయింపు, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని, వారు సమాజంలో కలిసిపోయేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. కర్రెగుట్టకు పర్యాటకంగా అపార అవకాశాలున్నాయని, పర్యావరణ, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా దీనిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని డీజీపీ తెలిపారు. పామూరు నుంచి చలమడ వరకు తారు రోడ్డు పనులు పూర్తయ్యాయని, త్వరలోనే బీటీ రోడ్డు పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
విద్యుత్, మొబైల్ నెట్వర్క్తోపాటు ఇతర మౌలిక సదుపాయాలను కూడా కల్పించి ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దనున్నట్లు వివరించారు.పామూరు శిబిరం సమీపంలోని గుత్తికోయ కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన డీజీపీ, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.మావోయిస్టు వ్యతిరేక పోరాటంలో సీఆర్పీఎఫ్ పాత్రను డీజీపీ ప్రత్యేకంగా ప్రశంసించారు. కుటుంబాలకు నెలల తరబడి దూరంగా ఉండి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న సీఆర్పీఎఫ్ 196 బెటాలియన్ సిబ్బంది సేవలు శాంతి పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించాయని కొనియాడారు.
ఈ పర్యటనలో అదనపు డీజీపీ సంజయ్ జైన్, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయ, ఎస్ఐబీ ఎస్పీ సింధు శర్మ, ములుగు కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ములుగు ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా, సీఆర్పీఎఫ్ అధికారులు, రెవెన్యూ, పర్యాటక శాఖల అధికారులు పాల్గొన్నారు.
