Keshampet | కేశంపేట, ఫిబ్రవరి 14: అరకొర అనుమతులను సాకుగా చూపెడుతూ కొండంత ఆక్రమణకు పాల్పడుతున్నారని సంగెం గ్రామ రైతులు మండిపడ్డారు. ఈ మేరకు మట్టిని తరలిస్తున్న టిప్పర్లను శుక్రవారం అడ్డుకొని ఆందోళనకు దిగారు. మూడు వేల మెట్రిక్ టన్నులకు అనుమతులు పొంది ఇప్పటి వరకు అంతకు రెండింతల మట్టిని తరలించారని రైతులు ఆరోపిస్తున్నారు.
సంగెం గ్రామంలోని 220/10/3లో నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 3న అనుమతులు పొందామని చెబుతున్న సదరు సంస్థ మట్టిని ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన పట్టా భూముల్లో ఎందుకు డంప్ చేస్తుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన బడా నేతల ఒత్తిడితోనే మట్టి మాఫియా ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోతుందని మహిళా రైతు సలీమా ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం అసైన్డ్ చేసిన సర్వే నెంబర్ 220/10/2లో భూమిలోనుంచి అక్రమంగా మట్టిని తరలించడం ఏమిటని, దాయాదుల మధ్య భాగ పరిష్కారం కాకుండానే తమ భూమిలో గోతులు తీస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. మట్టి తరలింపు
విషయమై ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకొని టిప్పర్లను నిలిపివేసి కేశంపేట పోలీసులకు అప్పగించే ప్రయత్నం చేశారు. దీంతో స్పందించిన సీఐ నరహరి మట్టి తరలింపు విషయమై తమకు అనుమతులు ఉన్నాయని చెబుతున్నారని, నిజానిజాలను పరిశీలిస్తానని ఎస్ఓటీ పోలీసులకు చెప్పడంతో అక్కడి నుంచి వారు వెనుదిరిగారు. మట్టిని తరలిస్తున్న టిప్పర్లను రైతులు నిలిపివేశారన్న విషయంమై స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను కేశంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. వాస్తవానికి మట్టి తరలింపు అక్రమమా? లేక సక్రమమా అనేది అధికారుల పూర్తిస్థాయి విచారణలో తేలాల్సి ఉంది.