Rythu Bharosa | పరిగి, మార్చి 10 : ఏడాది కాలంగా తనకు రైతు భరోసా కింద ఒక్క రూపాయి కూడా రాలేదని వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్కు చెందిన మొరంగపల్లి జంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి పేరు మీద నుంచి వ్యవసాయ భూమి తన పేరుపైకి మార్చుకుని ఏడాది అయిపోయిందని.. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ తనకు రైతు భరోసా ఇవ్వడం లేదని తెలిపారు. పంటలు పండిస్తున్న భూమికే రైతు భరోసా ఇవ్వకుంటే ఎవర్ని అడగాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తనకు పెట్టుబడి సాయం అందించాలని కోరారు.
‘ ఏడాది నుంచి ఒక్క రూపాయి రైతుభరోసా సహాయం రాలేదు. మా నాయన హన్మయ్య పేరిట గల భూమిలో మా అమ్మ మల్లమ్మ పేరిట ఒక ఎకరం, నా పేరిట 2.37 ఎకరాల భూమి చేసుకొని ఏడాది అవుతుంది. అప్పటి నుంచి రైతు భరోసా కోసం రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి పెట్టుబడి సహాయం రాలేదు. నేను పంటలు సాగు చేసుకుంటున్నా రైతు భరోసా రావడం లేదు. ప్రస్తుతం మొక్కజొన్న, కొత్తిమీర, కుసుమ పంటలు ఉన్నాయి. ఇటీవలె పత్తి తీయడం జరిగింది. పంటలు వేసే రైతుగా నాకే ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడం లేదు. దరఖాస్తు చేసుకున్న తర్వాత పలుమార్లు వ్యవసాయాధికారులను కలిసి రైతు భరోసా రాలేదని చెప్పగా వస్తుందేమో అనే సమాధానం తప్ప డబ్బులు రావడం లేదు. గత రెండు రోజుల క్రితం సైతం వ్యవసాయాధికారిని కలిసి రైతుభరోసా రాలేదని చెప్పాను. ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులందరికీ పెట్టుబడి సహాయం ఇస్తున్నట్లు చెబుతున్నది. నాకు రైతు భరోసా రావడం లేదు. మా నాయన పేరిట భూమి ఉన్న సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రైతుబంధు సమయానికి బ్యాంకు ఖాతాలో జమయ్యేది. అప్పట్లో పంటల సాగు కోసం విత్తనాల కొనుగోలు, కూలీల ఖర్చులకు రైతుబంధు డబ్బులు ఎంతో ఉపయోగపడేవి. మా నాయన పేరిట గల భూమిని నా పేరిటకు మార్పు చేసుకున్న తర్వాత రైతు భరోసా రావడం లేదు. ఇదేమి వైచిత్రమో అర్థం కావడం లేదు. పంటలు వేయాలంటే మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో అప్పుల కోసం చేతులు చాచకుండా రైతుబంధు డబ్బులతో పంటలు సాగు ప్రారంభించేవాళ్లం. వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్న భూములకే రైతు భరోసా రాకుంటే ఎవరిని అడగాలి. వ్యవసాయాధికారులు కేవలం వస్తుందని చెప్పడం తప్ప ఆచరణలో డబ్బులు రావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం నాకు రైతుభరోసా కింద పెట్టుబడి సహాయం అందించాలి.’ అని జంగయ్య అన్నారు.