Allu Arjun | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ మాస్టర్ మైండ్ లోకేష్ కనగరాజ్ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా #AA23 అనౌన్స్మెంట్ దశలోనే సంచలనం సృష్టిస్తోంది. సినిమా అధికారికంగా ప్రకటించిన క్షణం నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. విడుదలైన అనౌన్స్మెంట్ గ్లింప్స్ సినిమాప్రేమికులను మంత్రముగ్ధులను చేయగా, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందించిన పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే #AA23 ఓ అరుదైన ఆల్‌టైమ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కేవలం సినిమా అనౌన్స్మెంట్ థీమ్ మ్యూజిక్‌తోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 3.55 లక్షల (355K)కు పైగా రీల్స్ చేయడం ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం.
ఒక సినిమా అనౌన్స్మెంట్ గ్లింప్స్‌కు ఇంత భారీ స్థాయిలో రీల్స్ రావడం అంటే ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో సినిమా ప్రారంభ దశ నుంచే బజ్ క్రియేట్ చేయడం ఎంతో కీలకం. ఆ విషయంలో #AA23 వంద శాతం సక్సెస్ అయిందనే చెప్పాలి. అల్లు అర్జున్ మాస్ ఇమేజ్, లోకేష్ కనగరాజ్ స్టైలిష్ మేకింగ్, అనిరుధ్ హై-ఎనర్జీ మ్యూజిక్ కలిసి ఒక పవర్‌ప్యాక్ కాంబినేషన్‌గా మారాయి. అందుకే ఈ అనౌన్స్మెంట్ గ్లింప్స్ అభిమానులకే కాదు, న్యూట్రల్ ఆడియెన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది.
ఇదిలా ఉండగా, ఈ సినిమా లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఇరుంబుకై మాయావి’ ప్రాజెక్ట్‌నే అని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. భారీ యాక్షన్, ఇంటెన్స్ డ్రామా, డార్క్ టోన్‌తో సాగే కథాంశంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించనుందనే అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ నుంచి రాబోతున్న మరో పాన్ ఇండియా విజువల్ వండర్‌గా #AA23 నిలవనుందనే టాక్ వినిపిస్తోంది. అనౌన్స్మెంట్తోనే రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమా, థియేటర్లలోకి వచ్చినప్పుడు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.