Arjit Singh |బెంగాలీ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గాయకుడు అర్జిత్ సింగ్. ముఖ్యంగా బాలీవుడ్లో ఆయన గొంతు ఒక బ్రాండ్లా మారింది. మెలోడీ, విరహం, ప్రేమ భావాలను అత్యంత సహజంగా పలికించే ఆయన గానం దేశవ్యాప్తంగా కోట్లాది శ్రోతలను ఆకట్టుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా సంగీత ప్రియుల హృదయాలను శాసించిన అర్జిత్ సింగ్ ఇప్పుడు సినిమా పాటలకు విరామం ప్రకటించడం సంగీత అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.సింగర్‌గా మాత్రమే కాదు, మ్యూజిక్ కంపోజర్‌గా కూడా తన ప్రతిభను చాటిన అర్జిత్ సింగ్… అయినప్పటికీ గాయకుడిగానే అత్యధిక గుర్తింపు పొందారు. ఇప్పటివరకు ఆయన కెరీర్లో అన్ని భాషలు కలిపి 700కి పైగా పాటలు ఆలపించారు.
వీటిలో హిందీ పాటలే ఎక్కువగా ఉండగా, బెంగాలీ, తెలుగు, తమిళంతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఆయన గానం వినిపించింది. ముఖ్యంగా బాలీవుడ్లో ఆయన పాడిన ప్రేమ గీతాలు యువతను ఉర్రూతలూగించాయి. లవ్ సాంగ్స్‌కు అర్జిత్ గొంతు పర్యాయ పదంగా మారిందంటే అతిశయోక్తి కాదు. తెలుగులోనూ అర్జిత్ సింగ్ తనదైన ముద్ర వేశారు. 2010లో తొలి తెలుగు పాటతో పరిచయమైన ఆయన, ఆ తర్వాత ఎంపిక చేసుకున్న సినిమాల్లో మాత్రమే పాటలు పాడుతూ ప్రత్యేకతను నిలుపుకున్నారు. మెలోడీకి ప్రాధాన్యం ఇచ్చే పాటలనే ఎక్కువగా ఆలపిస్తూ తెలుగు శ్రోతల హృదయాలను కూడా గెలుచుకున్నారు. ఆయన పాడిన పాటలు ఇప్పటికీ ప్లేలిస్టుల్లో అగ్రస్థానంలో ఉంటాయి.
అర్జిత్ సింగ్ పాడిన తెలుగు పాటల విషయానికి వస్తే ఆయన తొలిసారిగా 2010లో `కేడీ` చిత్రానికి పాట పాడారు. ఇందులో `నీవే నా నీవేనా` అనే పాటని అలపించగా, అనంతరం మూడేళ్లకి 2013లో `స్వామిరారా`లో మూడు పాటలు పాడారు. `కృష్ణుడి వారసులంతా`, `అది ఏంటి ఒక్కసారి`, `ఈడు వాడు ఎవరో లేడు` వంటి పాటలు ఆలపించి ఆకట్టుకున్నారు. అలాగే `ఉయ్యాల జంపాలా`లో `ధేర్ తక్ చాలా` అనే పాటని, `నువ్వే నా బంగారం` మూవీలో `ఒక్కరికి ఒకరం`, `మనం` మూవీలో `కనులను తాకే ఇలా` అనే పాట ఆలపించారు. ఈ పాట ఆయనకు విశేషమైన గుర్తింపుని తీసుకువచ్చింది.
`నీ జతగా నేనుండాలి` మూవీలో `ప్రాణమా నా ప్రాణమా`, `మనసే పెదవినా`, `రౌడీ ఫెలో` మూవీలో `రా రా రౌడీ`, `ఆ సీతాదేవి నువ్వులా`.. `దోచెయ్` మూవీలో `నచ్చితే ఏ పనైనా`, `హాయి హాయి`, `హీ ఈజ్ మిస్టర్ మోసగాడు`.. `భలే మంచి రోజు` చిత్రంలో `నింగి నీదేరా`, `ఎవరి రూపో`.. `తను నేను` చిత్రంలో `సూర్యుడినే చూసోద్దామా`, `నువ్వు తోడు వుంటే లోకం`, `కేశవ` మూవీలో `ఏడిస్తే రారెవరు`, `పో పోరాడి`, `నా పేరు సూర్య` మూవీలో `మాయా`, `హుషారు` చిత్రంలో `నువ్వే నువ్వే`, `ఓం భీమ్ భుష్`లో `అనువణువు` వంటి పాటలు పాడి ఎంతగానో అలరించారు . మెలోడీ సాంగ్స్ తో ఎంతగానో ఆకట్టుకున్నారు.
సంగీత రంగానికి అందించిన సేవలకు గాను అర్జిత్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. అలాగే రెండు జాతీయ అవార్డులు, అనేక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఆయన ఖాతాలో చేరాయి. ‘ఫేమే గురుకుల్’ రియాలిటీ షో ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించిన అర్జిత్, 2011లో బాలీవుడ్లో బ్రేక్ అందుకుని అక్కడి సంగీతాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లైవ్ కాన్సర్ట్స్తో విపరీతమైన ఆదరణ పొందుతున్న అర్జిత్ సింగ్, ఈ కొత్త దశలోనూ తన సంగీతంతో అభిమానులను మంత్రముగ్ధులను చేయనున్నారని సంగీత వర్గాలు భావిస్తున్నాయి. సినిమా పాటల ద్వారా దేశాన్ని అలరించిన అర్జిత్, ఇకపై మరో రూపంలో శ్రోతల ముందుకు రానున్నాడు.