Shilpa Shetty | బాలీవుడ్ నటి శిల్పా శెట్టి నటనకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. గతంలో ముంబై బాంద్రాలో ‘బాస్టియన్’ అనే లగ్జరీ రెస్టారెంట్‌ను నిర్వహించిన ఆమె, అనివార్య కారణాల వల్ల గతేడాది ఆ రెస్టారెంట్‌ను మూసివేశారు. అప్పట్లోనే త్వరలో మరో కొత్త కాన్సెప్ట్‌తో తిరిగి రానున్నట్లు ప్రకటించిన శిల్పా, తాజాగా తన మాటను నిలబెట్టుకున్నారు. బాంద్రాలో ఆమె ప్రారంభించిన కొత్త రెస్టారెంట్‌కు ‘అమ్మ కాయ్’ అనే ఆకర్షణీయమైన పేరు పెట్టారు.ఈ రెస్టారెంట్ లాంచ్‌ను ప్రత్యేకంగా నిలిపేందుకు శిల్పా శెట్టి రిపబ్లిక్ డే సందర్భంగా ఓ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించారు.
ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు రెస్టారెంట్‌కు వచ్చే వారందరికీ ఉచిత అల్పాహారం అందిస్తామని వెల్లడించారు. ముందుగా ఎలాంటి పరిమితి లేకుండా, నిర్ణీత సమయంలో ఎంత మంది వచ్చినా అందరికీ ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ అందిస్తామని చెప్పడంతో ఈ ఆఫర్‌కు ఊహించని స్పందన వచ్చింది. ఆఫర్ విషయం తెలియగానే బాంద్రాలోని రెస్టారెంట్ ముందు జనసంద్రం నెలకొంది. సామాన్య ప్రజలే కాదు, అక్కడ నివసించే సంపన్నులు సైతం ఉచిత అల్పాహారం కోసం క్యూలో నిలబడటం అందరి దృష్టిని ఆకర్షించింది. రెస్టారెంట్ తెరవడానికి దాదాపు రెండు గంటల ముందే ప్రజలు అక్కడికి చేరుకుని, అర కిలోమీటరు మేర లైన్లో నిలబడ్డారు. ఈ స్థాయి హడావిడి చూసి సిబ్బంది కూడా కొంతసేపు అయోమయంలో పడినట్టు తెలుస్తోంది.
అయితే నిర్ణీత సమయం దాటిన తర్వాత వచ్చిన వారికి ఉచిత టిఫిన్ ఇవ్వలేమని సిబ్బంది చెప్పడంతో కొంతమంది అసంతృప్తితో వెనుదిరిగారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దృశ్యాలపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఉచితం అనే మాట వింటే సామాన్యులే కాదు, కోటీశ్వరులు కూడా ఆకర్షితులవుతారంటూ కొందరు వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు ఉచిత ఆఫర్లకు ప్రజలు ఎంతగా ఎగబడతారో ఇది మరో ఉదాహరణ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా, ‘అమ్మ కాయ్’ రెస్టారెంట్ ప్రారంభంతో శిల్పా శెట్టి మరోసారి బిజినెస్ రంగంలో తన సత్తా చాటారని చెప్పవచ్చు. ఒక్క ఆఫర్‌తోనే బాంద్రా ప్రాంతాన్ని కదిలించగలగడం, ఆమె బ్రాండ్ ఇమేజ్ ఎంత బలంగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది.