భువనేశ్వర్: భార్యకు పక్షవాతం రావడంతో వృద్ధుడైన భర్త తల్లడిల్లిపోయాడు. మెరుగైన చికిత్స కోసం 300 కిలోమీటర్లు రిక్షా తొక్కాడు. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి భార్యను తీసుకెళ్లి రెండు నెలల పాటు చికిత్స అందించాడు. (Man Pedals 300 Km By Rickshaw) ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వృద్ధ దంపతులైన 75 ఏళ్ల బాబు లోహర్, 70 ఏళ్ల జ్యోతి, సంబల్పూర్లోని మోడిపాడలో నివసిస్తున్నారు. అయితే జ్యోతికి పక్షవాతం వచ్చింది. సంబల్పూర్లోని ఆసుపత్రిలో చూపించారు. ఆమెకు ప్రత్యేక చికిత్స అవసరమని డాక్టర్లు తెలిపారు. కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని సూచించారు.
కాగా, 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రైవేట్ అంబులెన్స్‌లో భార్యను తీసుకెళ్లే స్థోమత బాబు లోహర్‌కు లేదు. అయినప్పటికీ భార్యకు అక్కడ చికిత్స అందించాలని ఆ వృద్ధుడు భావించాడు. మూడు చక్రాల బల్ల రిక్షాపై పరుపు వేశాడు. దానిపై భార్య జ్యోతిని ఉంచి సంబల్పూర్ నుంచి కటక్ బయలుదేరాడు.
మరోవైపు వయస్సు, తన శక్తిని లెక్కచేయని బాబు లోహర్ తొమ్మిది రోజుల పాటు ఆ రిక్షా తొక్కాడు. రాత్రి వేళ రోడ్డు పక్కన ఉండే షాపుల వద్ద వారు విశ్రాంతి తీసుకున్నారు. చివరకు కటక్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ జ్యోతి రెండు నెలల పాటు చికిత్స పొందింది. పక్షవాతం నుంచి కోలుకున్నది.

Odisha Old Couple
జనవరి 19న ఆ వృద్ధ దంపతులు మూడు చక్రాల బల్ల రిక్షాపై తమ గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే చౌద్వార్ సమీపంలో వారి రిక్షాను ఒక వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. దీంతో సమీపంలోని ఆరోగ్య కేంద్రం వద్దకు వారు చేరుకున్నారు. గాయాలకు చికిత్స పొందారు.
ఆ తర్వాత 300 కిలోమీటర్లు రిక్షా తొక్కి తిరిగి తమ గ్రామానికి చేరుకునేందుకు బాబు లోహర్ వెనుకాడలేదు. ఇది చూసి ఆరోగ్య కేంద్రంలోని వైద్య సిబ్బంది చలించిపోయారు. వారికి చికిత్స అందించిన డాక్టర్ వికాస్ వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించారు. దీంతో ఆ వృద్ధ దంపతులు వాహనంలో తమ గ్రామానికి చేరుకున్నారు. అయితే వయస్సు, వృద్ధాప్యాన్ని లెక్కచేయక భార్యకు చికిత్స కోసం ఎంతో శ్రమించిన బాబు లోహర్ నిబద్ధతను ఆ ప్రాంతవాసులు ప్రశంసించారు.
Also Read:
Man Killed Attacked Leopard | వ్యక్తిపై చిరుత దాడి.. దానిని ఎలా చంపాడంటే?
Professor Stabbed At Station | రైల్వే స్టేషన్లో.. ప్రొఫెసర్‌ను కత్తితో పొడిచి చంపిన ప్రయాణికుడు