Kodangal | కొడంగల్, మే 26: సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. కొడంగల్ మున్సిపల్ సమీపంలోని పాత కొడంగల్లో నాలుగు రోజులుగా తాగునీరు రాకపోవడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడంగల్ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ తమకు ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. నాలుగు రోజులుగా నీళ్లు రాకపోవడంతో పొలాల్లోకి వెళ్లి బోరుబావుల వద్ద నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తుందని చెప్పారు.
నాలుగు రోజులుగా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పటికీ పట్టించుకునే నాథుడే కరవయ్యాడని పాత కొడంగల్వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు. నీటి కోసం బోరుబావుల దగ్గరకు వెళ్తే.. పొలానికి నీళ్లు సరిపోవడం లేదని రైతులు చెబుతున్నారని అంటున్నారు. ఇలా తాగునీరు రానప్పుడు అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడితే బాగుంటుందని సూచించారు. ఒకటి రెండు రోజులు తాగునీరు రావడం లేదంటే సర్దుకోవచ్చు కానీ.. నాలుగు రోజులుగా నీళ్లు రాకపోతే ఎక్కడికి పోవాలని ప్రశ్నిస్తున్నారు. సీఎం ఇలాఖాలోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లు నీటి ఇబ్బంది అంటే ఏంటో తెలియలేదని.. ఇప్పటి పరిస్థితిని చూస్తుంటే మళ్లీ పాతరోజులు గుర్తుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి గోస తీర్చాలని వేడుకుంటున్నారు.