కూరగాయల సాగుతో రైతు ఇంట సిరులు కురువనున్నాయి. వరి ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చెప్పిన నేపథ్యంలో ఇతర పంటలు సాగు చేయాలన్న రాష్ట్ర సర్కార్ కృషి ఫలించింది. రంగారెడ్డి జిల్లాలో అధికంగా కూరగాయల పంటలను సాగు చేశారు. గడిచిన ఏడాదితో పోలిస్తే ఈసారి 5 వేల ఎకరాలకుపైగా పెరుగడం గమనార్హం. ప్రధానంగా టమాట, ఆకుకూరలు, క్యారెట్, క్యాబేజీ పంటలు సాగయ్యాయి. చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, తలకొండపల్లి, యాచారం మండలాల్లో కూరగాయల సాగు అధికంగా పెరిగింది. పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువని ఉద్యానవన శాఖ చేసిన విస్తృత ప్రచారంతో పాటు సాగు విధానాలను తెలియజేయడంతో అన్నదాతల్లో చైతన్యం వచ్చిందని చెప్పవచ్చు. రానున్న వానకాల సీజన్లోనూ జిల్లాలో 70 వేల ఎకరాల్లో కూరగాయల సాగును పెంచేలా ఉద్యానవన శాఖ అధికారులు ప్రణాళికను రూపొందించడంతో పాటు రైతులనూ ప్రోత్సహిస్తున్నారు.
– రంగారెడ్డి, ఏప్రిల్ 5, (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): జిల్లాలో కూరగాయల సాగు పెరిగింది. వరికి బదులు ఇతర పంటలను సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకిచ్చిన పిలుపుమేరకు జిల్లాలో భారీగా వరి సాగు తగ్గింది. వరికి బదులు చిరుధాన్యాలు, శనగ, వేరుశనగ తదితర పంటలతోపాటు కూరగాయల సాగు కూడా భారీగా పెరిగింది. రెండేండ్లలో జిల్లాలో 5వేల ఎకరాలకుపైగా పెరుగడం గమనార్హం. ప్రధానంగా టమాట, ఆకుకూరలు, క్యారెట్, క్యాబేజీ పంటల సాగు పెరిగింది. జిల్లాలోని రైతు వేదికల వద్ద జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు ఇతర పంటలపై అవగాహన కల్పించడంతోపాటు ఆన్లైన్ వేదికగా కూడా ఉద్యానవన రైతులకు ఇతర పంటలపై సంబంధిత అధికారులు అవగాహన పెంచారు. తక్కువ సమయం, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించవచ్చని అధికారులు సూచించడంతో రైతులు కూరగాయల సాగువైపు దృష్టి పెట్టారు. జిల్లాలోని చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, తలకొండపల్లి మండలాల్లో కూరగాయల సాగు అధిక మొత్తంలో పెరిగింది. వానకాలం సీజన్‌కు మించి యాసంగి సీజన్లో కూరగాయల సాగు పెరుగడం గమానర్హం.
జిల్లాలో కూరగాయల సాగు అధిక మొత్తంలో పెరిగింది. జిల్లాలో అత్యధికంగా టమాటతోపాటు ఆకుకూరలు, క్యారెట్ సాగు పెరిగింది. జిల్లాలో టమాట సాగు అధికంగా కందుకూరు, మహేశ్వరం, కేశంపేట, ఇబ్రహీంపట్నం మండలాల్లో అధికంగా సాగు చేస్తున్నారు. ఆకుకూరల సాగు ఇబ్రహీంపట్నం మండలంతోపాటు యాచారం మండలంలో, పచ్చిమిర్చి సాగు కడ్తాల్, కందుకూరు, చౌదరిగూడెం మండలాల్లో, చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి మండలాల్లో క్యారెట్ సాగు పెరిగింది. జిల్లావ్యాప్తంగా 5 వేల ఎకరాలకుపైగా కూరగాయల సాగు పెరుగడం గమనార్హం. జిల్లాలో వానకాలం సీజన్లో కూరగాయల సాగు విస్తీర్ణం 14,615 ఎకరాలుండగా, యాసంగి సీజన్లో 20 వేల ఎకరాలకు పెరిగింది. ఇతర పంటల సాగులో భాగంగా యాసంగిలో 20 వేల ఎకరాలకుపైగా కూరగాయల సాగుకాగా, టమాట-6082, ఆకుకూరలు-3799, క్యారెట్-1843, పచ్చి మిర్చి-1061, బీన్స్-920, బీట్రూట్-785, వంకాయ-763, క్యాలీఫ్లవర్-327, ఉల్లి-582, క్యాప్సికం-46, కీర-222, బెండకాయ-783, ఆలు-57, బీరకాయ-326, ఇతర కూరగాయలు-1117 ఎకరాల్లో సాగయ్యింది. గతేడాది యాసంగిలో 15,091 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగుకాగా, ఈ ఏడాది 20వేల ఎకరాలకుపైగా రైతులు సాగు చేశారు. వానకాలం సీజన్లోనూ జిల్లాలో ఉద్యానవన పంటల సాగును 70 వేల ఎకరాల వరకు పెంచేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు. గతేడాది వానకాలం ఉద్యానవన పంటల సాగు 45 వేల ఎకరాలకు ప్లాన్ చేయగా, ఈ ఏడాది వానకాలంలో 25వేల ఎకరాలకుపైగా సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు.
జిల్లాలో వరికి బదులుగా అధిక మొత్తంలో ఇతర పంటల సాగు అయ్యేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు అవగాహన కల్పించాం. దీంతో యాసంగిలో వరికి బదులుగా అత్యధికంగా కూరగాయల పంటలను జిల్లా రైతాంగం సాగు చేసింది. రెండేండ్లలో కూరగాయల సాగులో చాలా మార్పు వచ్చిందని, రైతులంతా వరికి బదులుగా ఉద్యానవన పంటల సాగు చేసినట్లయితే అధిక లాభాలు పొందొచ్చు.
– జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సునందరాణి