– 31 వార్డులు, 67 పోలింగ్ కేంద్రాలు
– రేపటి పోలింగ్ పక్రియకు పటిష్ట చర్యలు
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 10 : ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జరిగే ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10 గంటలకు హాజరైన పోలింగ్ సిబ్బంది, అధికారులకు సంబంధిత ఎన్నికల అధికారులు దిశా నిర్దేశం చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఆర్వోలకు పోలింగ్ కేంద్రానికి అవసరమైన సిబ్బందిని అందజేయడం జరిగింది. మొత్తం మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డులు ఉండగా ఇప్పటికే ఒక వార్డు ఏకగ్రీవం కావడంతో బుధవారం 31 వార్డుల్లో పోలింగ్ జరగనుంది.
ఓటర్ల సంఖ్యను ఆధారంగా 67 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకుగాను 12 మంది జోనల్ ఆఫీసర్లతో పాటు ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక ఆర్ఓ, ఏఆర్ఓ కలిపి ఏడుగురు అధికారులు పోలింగ్ బాధ్యత నిర్వహించనున్నారు. మంగళవారం భోజన విరామం తర్వాత 12 జోన్లకు సంబంధించిన బస్సుల్లో పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల అధికారి నవీన్ బాబు, రూరల్ తాసీల్దార్ రాంప్రసాద్, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ పాల్గొన్నారు.

Edulapuram Municipality : పోలింగ్ కేంద్రాలకు తరలిన ఎన్నికల అధికారులు, సిబ్బంది