న్యూఢిల్లీ, ఆగస్టు 2 : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో తీవ్ర ఒడిదుడుకులు లోనుకావచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వడ్డీరేట్లపై రిజర్వు బ్యాంక్ తీసుకునే నిర్ణయం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తోడు క్రూడాయిల్ ధరలు సూచీల ట్రేడింగ్‌నకు దిక్సూచిగా మారనున్నాయి. అలాగే కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తీసుకునే నిర్ణయాలు కూడా మదుపర్లలో సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. రిజర్వుబ్యాంక్ తన ద్రవ్యపరపతి సమీక్షా సమావేశాన్ని ఈ నెల 5న ప్రకటించనుండటంతో మార్కెట్ వర్గాలు దీనిపై ప్రధానంగా దృష్టిసారించనున్నారని, కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు ఈ వారంలోనే ముగియనుండటం కూడా సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నదని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ సీనియర్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. అంతర్జాతీయంగా నెలకొననున్న పరిణామాలు, మరి ముఖ్యంగా ఇరాన్-అమెరికా దేశాల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కి వస్తే సూచీలు భారీగా పుంజుకునే అవకాశం ఉందన్నారు. వీటికి తోడు క్రూడాయిల్ ధరలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌కు కీలకంగా మారుతుందన్నారు. ఈ వారంలోనే డీఎల్ఎఫ్, భారతీ ఎయిర్టెల్, ఓఎన్జీసీ, హీరో మోటోకార్ప్, ఎల్ఐసీ, ఎస్బీఐలు తన తొలి త్రైమాసికపు ఆర్థిక ఫలితాలను విడుదల చేయబోతున్నాయి. గతవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 2,035 పాయింట్లు లేదా 2.67 శాతం, ఎన్ఎస్ఈ నిఫ్టీ 616 పాయింట్లు లేదా 2.59 శాతం బలపడిన విషయం తెలిసిందే.
గత నాలుగు నెలలుగా పెట్టుబడులను భారీగా తరలించుకుపోయిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు జూలై నెలలో ఏకంగా రూ.20 వేల కోట్లకు పైగా పెట్టుబడులు కుమ్మరించారు. అంతర్జాతీయ దేశాలతో పోలిస్తే దేశీయ ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉండటం, మార్కెట్లు కూడా స్థిరంగా ట్రేడవుతుండటంతో విదేశీ మదుపర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. కార్పొరేట్లు ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో గత నెలలో రూ.20,200 కోట్ల పెట్టుబడులు పెట్టారు. జూన్ నెలలో రూ.49,340 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు..మే నెలలో రూ.32,963 కోట్లు, ఏప్రిల్ నెలలో రూ.60,847 కోట్లు, మార్చి నెలలో అయితే ఏకంగా రూ.1.17 లక్షల కోట్లను తరలించుకుపోయారు. గత నాలుగు నెలల్లో రూ.2.60 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్నట్టు అయింది. దేశీయ ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉండటం, లార్జ్-క్యాప్ సంస్థలు మెరుగైన పనితీరు కనబరుస్తుండటంతో విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపడానికి ప్రధాన కారణాలని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ వీకే విజయకుమార్ తెలిపారు. దక్షిణకొరియా, తైవాన్ సూచీలు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో ఎఫ్‌పీఐలు తమ పెట్టుబడులను భారత్‌కు తరలించారని పేర్కొన్నారు.
బ్లూచిప్ సంస్థల మార్కెట్ విలువ రాకెట్ వేగంతో దూసుకుపోయింది. గతవారంలో టాప్-10 కంపెనీల్లో తొమ్మిది సంస్థల మార్కెట్ విలువ రూ.2.51 లక్షల కోట్ల మేర పెరిగింది. వీటిలో బజాజ్ ఫైనాన్స్ విలువ అత్యధికంగా రూ.80 వేల కోట్లకు పైగా ఎబాకింది. గత వారంలో కంపెనీ షేరు 8 శాతం పెరుగడమే ఇందుకు కారణం. దీంతోపాటు భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, టీసీఎస్, ఎస్బీఐ, ఎల్అండ్ టీ, ఎల్ఐసీ మార్కెట్ విలువ కూడా భారీగా పెరిగింది. కానీ, హిందుస్థాన్ యునిలీవర్ మార్కెట్ విలువ రూ.10,326.46 కోట్లు కరిగిపోయి రూ.4,93,602.13 కోట్లకు పడిపోయింది.
