Liver Health | మన శరీరంలో కాలేయం అనేక విధులను నిర్వర్తిస్తుంది. శరీరం నుండి విషాన్ని బయటకు పంపించడం, శరీర జీవక్రియలను నిర్వహించడం, జీర్ణక్రియకు మద్దతు ఇవ్వడం, శరీరానికి అవసరమైన పోషకాలను నిల్వ చేయడం ఇలా అనేక రకాల విధులను ప్రతిరోజూ నిర్విరామంగా నిర్వర్తిస్తుంది. కాలేయ ఆరోగ్యం ఏ మాత్రం దెబ్బతిన్నా మొత్తం శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. సరైన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కొన్ని సులభంగా తయారు చేసుకునే పానీయాలను తీసుకోవడం ద్వారా కాలేయాన్ని శుభ్రపరుచుకోవడంతో పాటు కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే నీటిని ఎక్కువగా తాగాలి. నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉండడంతో పాటు శరీరం నుండి విషాలు ఎక్కువగా బయటకు తొలగిపోతాయి. అలాగే క్రీమ్, చక్కెర వంటివి లేకుండా బ్లాక్ కాఫీ తాగడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా చేయడంలో సహాయపడతాయి. దీంతో ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి కాలేయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. క్రమం తప్పకుండా గ్రీన్ టీని తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడడంలో మనకు దోహదపడతాయి.
బీట్రూట్ రసం కూడా కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది కాలేయానికి ఒక సహజ టానిక్ లాగా పని చేస్తుంది. బీట్రూట్ రసంలో ఉండే బీటాలైన్లు, నైట్రేట్లు కాలేయం నిర్విషీకరణ ఎంజైమ్లను పెంచుతాయి. బీట్రూట్ రసం తీసుకోవడం వల్ల కాలేయ వాపు తగ్గుతుంది. అలాగే ఆకుకూరలు, క్యారెట్లు, సెలెరీ వంటి వాటితో జ్యూస్ చేసి తీసుకోవడం వల్ల కాలేయంలో డీటాక్సిఫికేషన్ ప్రక్రియతో పాటు కాలేయం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రోజూ ఒక గ్లాస్ నిమ్మకాయ నీరు తాగడం వల్ల కాలేయం సహజంగా శుభ్రపడుతుంది. నిమ్మకాయ నీరే అని చాలా మంది తేలికగా తీసుకుంటారు. కానీ కాలేయాన్ని శుభ్రపరచడంలో ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది. అదే విధంగా ఉసిరికాయ జ్యూస్ కూడా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్దిగా ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మనకు సహాయపడతాయి.
కొబ్బరి నీరు కూడా కాలేయ ఆరోగ్యానికి మద్దుతు ఇస్తాయి. కొబ్బరి నీటిని తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. శరీరానికి కావల్సిన ఎలక్ట్రోలైట్స్, పోషకాలు అందుతాయి. అల్లం శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. అల్లం కషాయాన్ని తీసుకోవడం వల్ల వాపు తగ్గి కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీలకర్ర నీరు కూడా కాలేయానికి మేలు చేస్తుంది. జీలకర్ర నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తద్వారా కాలేయంపై ఒత్తిడి తగ్గుతుంది. కాలేయంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ కూడా సమర్థవంతగా జరుగుతుంది. ఇలాంటి సహజసిద్దమైన పానీయాలను తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడడంతో పాటు కాలేయ ఆరోగ్యం కూడా సరిగ్గా ఉంటుంది. ఈ పానీయాలను తాగడం వల్ల మొత్తం శరీరానికి కూడా మేలు కలుగుతుంది.