– మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా అంతటా కట్టుదిట్టమైన నాకాబంది, విస్తృత తనిఖీలు
– అక్రమంగా తరలిస్తున్న 4.9 కేజీల వెండి, 24 బీర్ బాటిళ్లు, 64 చీరలు స్వాధీనం
నల్లగొండ, ఫిబ్రవరి 10 : నల్లగొండ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, భద్రంగా జరిగేలా పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన నాకాబంది, విస్తృత తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎస్పీ స్వయంగా నల్లగొండ పట్టణంలోని బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, లాడ్జీలు, హోటళ్లు, రద్దీ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. చెక్‌పోస్టులు, పోలీస్ నాకాబంది, వాహన తనిఖీలు, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నాకాబంది నిర్వహిస్తూ అనుమానిత వ్యక్తులు, వాహనాలపై విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 4.9 కేజీల వెండి, 24 బీర్ బాటిళ్లు, 64 చీరలు, ఇతర నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్‌కు ముందు, పోలింగ్ పూర్తయ్యే వరకు సైలెంట్ పీరియడ్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కాలంలో ఎలాంటి ప్రచారం, సభలు, ర్యాలీలు, మైకుల వినియోగం, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. అక్రమ నగదు, మద్యం, ఇతర నిషేధిత వస్తువుల తరలింపుపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని, పట్టుబడితే ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. లాడ్జీలు, హోటళ్లలో అక్రమంగా తలదాచుకునే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమాలను తప్పనిసరిగా పాటించాలని, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.