వికారాబాద్, జూన్ 3 : రైతులు భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎర్రవల్లి, ఆలంపల్లిలలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. భూ భారతి చట్టం ద్వారా రైతులకు కావాల్సిన సేవలను అందించాలని కలెక్టర్ సూచించారు. సాదా బైనామా, పిఓపి, భూ విస్తీర్ణంలో మార్పులు, చేర్పులు, పాసు పుస్తకాల అందజేత తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు. సమస్యల పరిష్కారం దిశగా రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సాధించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీల నమోదు రిజిస్టర్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పెండ్లిమడుగు గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణాలు చేపట్టుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడి చెల్లింపులపై ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు జిల్లా కలెక్టర్ లింగ్యా నాయక్, ఆర్డీఓ వాసు చంద్ర, తహసిల్దార్ లక్ష్మీనారాయణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.