వికారాబాద్, జూన్ 9 : ప్రభుత్వం ప్రవేశపెట్టినఅభివృద్ధి, సంక్షేమపథకాలు ప్రజలకు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా ఆదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, ఆర్డిఓ వాసు చంద్రతో కలసి విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో అపరిస్కృతంగా ఉన్న సమస్యలను సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు.
మండల ప్రత్యేక అధికారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, బడిబాట, ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. చౌక ధర దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ పై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని, అదేవిధంగా మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్లను గ్రౌండింగ్ చేసి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజావాణిలో (84) దరఖాస్తులు రాగా రెవెన్యూ సమస్యలతో పాటు వ్యవసాయ, భూముల సర్వే, పెన్షన్లు, ఆర్టీసీ, ఇండ్ల, రేషన్ కార్డు లు మంజూరి తదితర అంశాలపై విజ్ఞప్తులు వచ్చాయి.