సిటీబ్యూరో, మార్చ్2(నమస్తే తెలంగాణ): ప్రముఖ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం అధికారపార్టీ నేతల అధికార దర్పానికి అడ్డాగా మారింది. తాము చెప్పిన మాట వినలేదంటూ అధికారులు, సిబ్బందిని టార్గెట్గా చేసుకున్న హస్తం నేతలు ఆలయంలో హల్చల్ చేస్తున్నారు. గతనెల 27న మంత్రి కొండాసురేఖ ఆకస్మిక పర్యటనపై ప్రస్తుతం దేవాదాయశాఖతో పాటు ఆలయంలో జరుగుతున్న చర్చ మొత్తం స్థానిక రాజకీయం చుట్టూ తిరుగుతోంది. ముఖ్యంగా స్థానిక కాంగ్రెస్ ముఖ్య నేతలు కొందరు తమ పార్టీకి సంబంధించిన వారికి ఆలయంలో ప్రాధాన్యత కల్పించకపోగా ఇప్పటికీ బీఆర్ఎస్నేతల మాటే వింటున్నారంటూ దేవాలయ సిబ్బందిపై విరుచుకుపడ్డారు.
మంత్రి సురేఖ పర్యటనలో ఆ ఇద్దరు అధికారులపై ఫిర్యాదు చేయడమే కాకుండా వారిని సస్పెండ్ చేయాలని, లేకుంటే వీరెవరూ మన మాట వినరంటూ చెప్పడం అక్కడ ఉన్నవారందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో ఆలయ ఈవో శేఖర్, సూపరింటెండెంట్ హైమావతిలను ఆర్థికలావాదేవీలు, పాలనావ్యవహారాలు, దేవాలయ నిర్వహణలో లోపాలకు బాధ్యులను చేస్తూ సోమవారం దేవాదాయశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ వెనక స్థానిక కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు మంత్రితో పాటు దేవాదాయ ఉన్నతాధికారుల వద్ద పట్టుబట్టి ఉత్తర్వులు ఇచ్చేవరకు వదిలిపెట్టలేదనే చర్చ జరుగుతోంది.
తాము చెప్పిన మాటల వినకపోగా, తమకే ఎదురు సమాధానం ఎలా చెబుతారంటూ ప్రశ్నించిన ఆ నేత ఈ ఇద్దరు అధికారుల సస్పెన్షన్ తర్వాత ధర్మకర్తలతో పాటు స్థానిక కాంగ్రెస్ శ్రేణులకు ఈ ఉత్తర్వులు వైరల్ చేయాలంటూ చెప్పినట్లు సమాచారం. ఇదే క్రమంలో ఆలయ ట్రస్ట్బోర్డుకు సంబంధించిన కొందరు ఆలయంలో కొందరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తీసుకోవాలంటూ అడగగా, ఆలయ అధికారులు తమకు ఆ అధికారం లేదని, ఎండోమెంట్ చట్టం ప్రకారమే వెళ్తామని చెప్పడంతో మరింత వివాదాస్పదమైంది. దీంతో అక్కడ ఉన్నవారందరినీ ఎందుకు కొనసాగిస్తున్నారంటూ అడగగా వారిని తాము తీసుకోలేదని, తీసేయాలంటే వారిపై ఏదో ఒక ఫిర్యాదు ఉండాలని చెప్పడంతో మంత్రి పర్యటనలో వారందరినీ టార్గెట్గా ఫిర్యాదుల పరంపర కొనసాగించారని ఆలయంలో మాట్లాడుకుంటున్నారు.
అసలు వివాదమంతా రేకుల షెడ్డుకు ఉన్న బోర్డుపై ఆ పేరు ఉండడమే కారణమనే చర్చ కూడా జరుగుతోంది. స్థానిక కాంగ్రెస్ నేత తన ప్రత్యర్థి పేరు ఆలయంలో ఎక్కడా ఉండకూడదని చెబుతూ అక్కడే ఉన్న బోర్డును తొలగించాలని చెప్పడం, ఆలయ అధికారులు ససేమిరా అనడంతో ఆ నేత భగ్గుమన్నారు. ఇంచార్జ్ మంత్రితో పాటు దేవాదాయమంత్రికి ఫిర్యాదు చేసి వెంటనే ఆలయంలో జరుగుతున్న వ్యవహారాన్ని చక్కదిద్దాలని లేకుంటే తమకు ప్రాతినిద్యంకోల్పోతామని చెప్పడంతో మంత్రి పర్యటన కొనసాగింది.
అడుగడుగునా ఆలయ సిబ్బంది తప్పులు ఎంచడమే కాకుండా వారిని టార్గెట్గా మంత్రి పర్యటనలో స్థానిక నేతలు చెబుతున్న ఫిర్యాదులు చూస్తే అసలు అమ్మవారి ఆలయంలో ఈ రాజకీయాలు ఏంటంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఆలయాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన దాతలు ఏ పార్టీ వారైనా వారికి సంబంధించిన ఆనవాళ్లు అక్కడ ఏర్పాటు చేయడం ఆనవాయితీ. సస్పెండయిన అధికారులు ఇద్దరూ ఆలయానికి వచ్చిన తర్వాత అక్కడ ఆదాయం పెరిగిందని, అదే ఆలయంలో క్రిమినల్ కేసులున్న అర్చకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు అదే అర్చకుడు దాతలు ఇచ్చిన పదహారులక్షల విలువైన నగను మాయం చేశారని దేవాదాయవర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి.