కొడంగల్, జూన్ 10 : భూ సమస్యల పరిష్కార వేదికలుగా రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం మండలంలోని రావులపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అర్జీదారుల సమస్యలను స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివరాల నమోదులో తప్పిదాలు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని, సంబంధిత రిజిస్టర్లలో వివరాలు నమోదు చేయాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్‌డెస్క్ లను, రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. సమస్యల వారీగా అర్జీలను విభజిస్తూ, పక్కాగా రికార్డులను పొందుపర్చాలని అన్నారు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, సానుకూలంగా ఉన్న సమస్యలను సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు.
ఒకవేళ సమస్యను పరిష్కరించేందుకు నిబంధనలు అంగీకరించని పక్షంలో దరఖాస్తుదారుడికి ఆ విషయాన్ని స్పష్టంగా అర్ధమయ్యే రీతిలో తెలియజేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తుదారులను పదేపదే తిప్పుకోకూడదని, సదస్సులో అర్జీలు అందించేందుకు వచ్చే వారితో సున్నితంగా వ్యవహరించాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, పూర్తి రికార్డుల ఆధారంగానే వాటిని పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో తహసిల్దార్ విజయ కుమార్, సిబ్బందక్ రైతులు పాల్గొన్నారు.