వికారాబాద్, నవంబర్ 20 : మహనీయు మార్గంలో నడిచి వారి ఆదర్శంగా తీసుకొని విద్యను అభ్యసించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం అంతర్జాతీయ బాలల హక్కుల, జాతీయ గ్రంథాలయ దినోత్సవాల సందర్భంగా వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థలో సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రులయ్యారని, భారత ప్రజలకు మంచి రాజ్యాంగాన్ని రూపొందించారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు వివిధ భాషల పట్ల పట్టును సాధించుకోవడం వల్ల కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి వీలవుతుందని తెలిపారు.
చదువుతోపాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ప్రతి ఒక్కరు చిన్నప్పటినుండే కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని సూచించారు. చదువు ద్వారానే సమాజంలో మంచి గుర్తు తీసుకువస్తుందని, మన తల్లిదండ్రులకు కూడా గౌరవాన్ని పెంపొందించే దిశగా ప్రతి ఒక్కరూ మెదలుకోవాలని కలెక్టర్ తెలిపారు. చదువే ఒక ఆయుధంగా మలుచుకొని జీవితాన్ని గొప్పగా తీర్చి దిద్దుకోవాలని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలయాలకు వెళ్ళే అలవాటు చేసుకోవాలని వివరించారు. సందర్భంగా వ్యాసరచన, రంగోలి, మెహందీ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సురేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.