వికారాబాద్, జనవరి 21 : గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు అన్ని శాఖల అధికారులతో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎలాంటి లోటు పాట్లకు తావులేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
కలెక్టరెట్ కార్యాలయ ఆవరణలో వేడుకలు నిర్వహించనున్నందున అందుకనుగుణంగా వేదిక పనులు చేపట్టాలన్నారు. జాతీయ భావం పెంపొందేలా విద్యార్థులచే వినూత్న సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. ఆయా శాఖల వారీగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వరి, డీఆర్ఓ మంగీ లాల్, ఆర్డిఓ వాసు చంద్ర, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఫర్హీనబేగం, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.