ఖమ్మం రూరల్, మార్చి 02 : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రియదర్శిని మహిళ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 16 మంది విద్యార్థినులు ప్రముఖ బహుళ జాతి సంస్థ పెంటగాన్ టెక్నాలజీస్ బెంగళూరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇంజినీర్లుగా రూ.6 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగ నియామకం పొందారు. ఈ సందర్భంగా సోమవారం కళాశాల యాజమాన్యం విద్యార్థినులను హృదయపూర్వకంగా అభినందించింది. కళాశాల చైర్మన్ కాటేపల్లి నవీన్ బాబు మాట్లాడుతూ.. నాణ్యమైన విద్య, ప్రాక్టికల్ నైపుణ్యాలు, సమర్థవంతమైన క్యాంపస్ రిక్రూట్మెంట్ శిక్షణ వల్లే విద్యార్థినులు మంచి సంస్థల్లో ఉద్యోగాలు సాధించగలుగుతున్నారని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.గోపాల్ మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులకు బలమైన అకడమిక్ పునాదితో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన శిక్షణ అందించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
సిద్ధాంత విజ్ఞానాన్ని ప్రాయోగిక నైపుణ్యాలతో సమన్వయం చేస్తూ విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేస్తున్నామని, ఇది విద్యార్థుల కృషి, అధ్యాపకుల మార్గదర్శకత్వం, కళాశాల అందిస్తున్న నాణ్యమైన అకడమిక్–టెక్నికల్ శిక్షణ ఫలితమన్నారు. ఈ విజయం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు. కళాశాల అకాడమిక్ డైరెక్టర్ అట్లూరి వెంకటరమణ మాట్లాడుతూ తమ కళాశాలలో అమలు చేస్తున్న బలమైన అకడమిక్ ప్రణాళిక, ఫలితాలపై దృష్టి సారించిన బోధనా విధానం, నిరంతర శిక్షణ కార్యక్రమాల సమిష్టి ఫలితంగా ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ తివారి మన్మోహన్ పాల్గొన్నారు.