చండీగఢ్: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ సెలవుపై ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవ నేపథ్యంలో ఆమెను కొట్టడంతో మరణించింది. అయితే టెర్రస్ పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడినట్లు భార్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఆ మహిళ శరీరంపై పలు గాయాలు ఉండటంతో అనుమానించిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. (Jawan Kills Wife) పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అమర్జిత్ సింగ్ బీఎస్ఎఫ్లో జవాన్. 12 ఏళ్ల కిందట రమాతో అతడికి వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
కాగా, ఆగస్ట్ 13న రాత్రి వేళ అమర్జిత్ సింగ్ సెలవుపై ఇంటికి చేరుకున్నాడు. భార్య రమాతో గొడవ వల్ల అతడు దాడి చేయడంతో గాయాలతో ఆమె మరణించింది. అయితే ఆగస్ట్ 14న తెల్లవారుజామున 4 గంటల సమయంలో భార్య కుటుంబానికి అమర్జిత్ సింగ్ ఫోన్ చేశాడు. ఇంటి పైకప్పు పైనుంచి ఆమె కింద పడిందని, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పాడు.
మరోవైపు రమా కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు తెలుసుకున్నారు. రమా శరీరంపై పలు చోట్ల గాయాలు ఉండటాన్ని గమనించారు. దీంతో భర్త అమర్జిత్ సింగ్ ఆమెను కొట్టి హత్య చేసినట్లు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహం జరిగినప్పటి నుంచి తన కుమార్తెను భర్త వేధించడంతోపాటు శారీరకంగా కొట్టి హింసిస్తున్నట్లు రమా తండ్రి ఆరోపించారు.
కాగా, అమర్జిత్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ జవాన్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. మిగిలిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. పోస్ట్‌మార్టం తర్వాత రమా మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వివరించారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.