AP News : ఏపీలోని విజయవాడ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు నీట మునిగి దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం కృష్ణలంక మెట్ల బజారు సమీపంలోని పద్మావతి ఘాట్ దగ్గర జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ముగ్గురు యువకులు శనివారం రాత్రి పద్మావతి ఘాట్ వద్ద నదిలో ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు. అయితే ప్రవాహ వేగాన్ని, నీటి లోతును అంచనా వేయలేక వారు గల్లంతయ్యారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటికే గాలింపు బృందాలు ముగ్గురి మృతదేహాలను వెలికి తీశాయి. మృతులను గడ్డం జాషువా (17), వీసం గౌతమ్ (18), తిగుళ్ల తేజ (18) గా గుర్తించారు. మృతులంతా తక్కువ వయసు వారే కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతులు ఏ ప్రాంతానికి చెందిన వారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.