Jay Pawar : ప్రైవేటు విమాన సర్వీసుల సంస్థ వీఎస్ఆర్ వెంచర్స్ (VSR ventures) తీరుపై అజిత్ పవార్ (Ajit Pawar) కుమారుడు జై పవార్ (Jay Pawar) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ సంస్థకు చెందిన ఓ విమానం ప్రయాణిస్తున్న సమయంలో యజమాని కుమారుడు రోహిత్ సింగ్ (Rohit Singh) కో పైలట్ సీట్లో నిద్ర పోతున్న వీడియోను జై పవార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
విమానం ప్రయాణిస్తుండగా రోహిత్ సింగ్ కో పైలట్ స్థానంలో కూర్చుని నిర్లక్ష్యంగా వ్యవహరించాడని జై పవార్ ఆరోపించారు. కొంతకాలం క్రితం వీఎస్ఆర్ సంస్థకే చెందిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రోహిత్ సింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ను జై కోరారు.
ఈ ఘటనపై దర్యాప్తు పూర్తయ్యేవరకు అతడిని అరెస్ట్ చేయాలని, అన్ని వీఎస్ఆర్ విమానాలను నిలిపివేయాలని జై పవార్ డిమాండ్ చేశారు. విమాన ప్రమాదంలో తన తండ్రిలా ఇంకెవరికీ జరగకూడదని అన్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని రోహిత్ సింగ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.