ఝరాసంగం : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల ( Sports ) పై ఆసక్తి పెంచుకోవాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ( MLA Manik Rao ) సూచించారు. ప్యారవరం గ్రామంలో సర్పంచ్ నర్మదారాణి,రాజ్‌కుమార్ దంపతులు తమ సొంత నిధులతో విద్యార్థినీ విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా క్రీడా దుస్తులు, షూస్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో శారీరక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారని, వారికి తగిన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించగలరని అన్నారు. చదువుతోపాటు క్రీడలకూ సమయం కేటాయించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎమ్మెల్యే, సర్పంచ్ దంపతులు, నాయకులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.