వికారాబాద్, నవంబర్ 10 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 65 ఫిర్యాదులు వచ్చాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ లు లింగ్యా నాయక్, సుదీర్, డి ఆర్ ఓ మంగ్లీ లాల్, ఆర్ డి ఓ వాసు చంద్ర లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. పెన్షన్, వ్యవసాయం, గృహనిర్మాణ శాఖ, భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని, అట్టి ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచ కుండా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.