సింగరేణిలో కాంగ్రెస్ ప్రముఖుల అవినీతిని గమనించిన కొత్తగూడెం ప్రజలు.. ఇటీవలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విలక్షణ తీర్పునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడడాన్ని, పొత్తు ధర్మాన్ని కాలరాసి సీపీఐని ముప్పుతిప్పలు పెట్టడాన్ని కళ్లారా చూసిన కొత్తగూడెంలోని కోల్బెల్ట్ ఓటర్లు ఈ ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధిచెప్పారు. అయినా తన పంథాను మార్చుకోని కాంగ్రెస్.. అధికార పీఠం కోసం పాకులాటలకూ, ఒత్తిళ్లకూ దిగిందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇందులో భాగంగానే శనివారం అర్ధరాత్రి సీఎం నేతృత్వంలో కాంగ్రెస్, సీపీఐ నేతలు పొత్తు కుదుర్చుకున్న విషయం విదితమే. తొలి అర్ధభాగంలో కొత్తగూడెం మేయర్ పదవిని సీపీఐ, డిప్యూటీ మేయర్ పదవిని కాంగ్రెస్ పంచుకునేలా; మలి అర్ధభాగంతో మేయర్ పదవిని కాంగ్రెస్, డిప్యూటీ మేయర్ పదవిని సీపీఐ తీసుకునేలా ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ తీరు పట్ల కొత్తగూడెం ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారంటూ విశ్లేషకులు చెబుతున్నారు. అదీగాక, ప్రజలు విలక్షణ తీర్పునిచ్చినా కాంగ్రెస్ మాత్రం సాగిలపాట్లు, ఒత్తిళ్లతో ‘చేతి’వాటం ప్రదర్శించిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
-భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ)
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ (కేజీఎంసీ)కి తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు కాంగ్రెస్కు తగిన బుద్ధిచెప్పినప్పటికీ.. ఆ పార్టీ నేతలు మాత్రం కుస్తీ పట్లు వదల్లేదు. ఏకంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగారు. 60 డివిజన్లతో ఏర్పాటైన కేజీఎంసీలో సీపీఎంతో కలిసి 40 డివిజన్లలో గెలవాలనుకున్న కాంగ్రెస్కు భంగపాటు తప్పలేదు. కాంగ్రెస్ మిత్రద్రోహం కారణంగా సీపీఐ సొంతంగా పోటీచేసింది. దీంతో ఈ రెండు పార్టీలు చెరో 22 చొప్పున డివిజన్లను గెలుచుకున్నాయి. బీఆర్ఎస్ 8, సీపీఎం, బీజేపీ చెరో స్థానం గెలుచుకున్నాయి. స్వతంత్రులు 6 డివిజన్లలో విజయం సాధించారు. మ్యాజిక్ ఫిగర్ అయిన 31 స్థానాలను ఏ పార్టీ కూడా గెలవకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, సీపీఐ నేతలు ఎవరికి వారు ఎత్తుగడలు వేసుకున్నారు. చివరికి, సీపీఐ నేతలతో చర్చల పేరిట కాంగ్రెస్ నేతలు సాగిలపాట్లకు, ఒత్తిళ్లకు దిగారు. చివరికి చెరో రెండున్నరేళ్లే మేయర్ పీఠాన్ని పంచుకునేలా ఒప్పందం చేసుకున్నారు.
11 చోట్ల మూడోస్థానంలో కాంగ్రెస్..
కేజీఎంసీలోని 60 డివిజన్లకుగాను 22 డివిజన్లలో ఆ పార్టీ విజయం సాధించగా.. మరో 11 స్థానాల్లో ఓటర్లు దానిని మూడో స్థానానికి పరిమితం చేశారు. మిగతా చోట్ల సీపీఐ, బీఆర్ఎస్ మధ్యే పోటీ బాగా నడిచింది. 1, 12, 13, 29, 34, 39, 42, 47, 48, 53, 57 డివిజన్లలో బీఆర్ఎస్కు పోటీ ఇవ్వలేక మూడోస్థానంలో నిలిచింది.
గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒకటే సీటు..
బీఆర్ఎస్ హయాంలో జరిగిన గత ఎన్నికల్లో 36 వార్డులతో ఉన్న కొత్తగూడెం మున్సిపాలిటీలో అప్పటి ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఒకే ఒక్క వార్డును మాత్రమే గెలుచుకుంది. కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ 8 స్థానాలను గెలుచుకొని సత్తాచాటుకుంది. మరో నాలుగు చోట్ల అతి తక్కువ ఓట్లతో వెనుకబడాల్సి వచ్చింది. అయినప్పటికీ అధికార కాంగ్రెస్కు మేయర్ పీఠం సొంతంగా దక్కకపోవడం గమనార్హం.