– రైతు కూలీ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి పున్నంచంద్
బూర్గంపహాడ్, ఆగస్టు 04 : బూర్గంపహాడ్ మేజర్ పంచాయతీలో దోమలు విజృంభిస్తున్నాయని, సీజనల్ వ్యాధులు ప్రబలే సమయం కావడంతో దోమల నివారణకు పంచాయతీ అధికారులు, సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టాలని రైతు కూలీ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి పున్నంచంద్ డిమాండ్ చేశారు. వర్షాకాలం ప్రారంభమైతే గోదావరి వరద కారణంగా పంచాయతీ పరిధిలో దోమలు విజృంభిస్తాయని, అంతేకాకుండా వీధులన్నీ బురదమయంగా మారి నీరు నిల్వ ఉండి దోమలు నివాసం ఏర్పాటు చేసుకుని అపరిశుభ్రతకు కారణమవుతాయన్నారు. పంచాయతీ పరిధిలోని వీధుల్లో చెత్తాచెదారం పేరుకుపోయి మురుగునీటి కాల్వల్లో దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయని వీటి నివారణకు దోమలమందు (ఫాగింగ్) పిచికారీ చేయాలని, బ్లీచింగ్ చల్లించాలని, పారిశుధ్య పనులు ముమ్మరం చేసి ప్రజల ఆరోగ్యంపై దృష్టిసారించి అంటురోగాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని పంచాయతీ అధికారి, ప్రజా ప్రతినిధులను కోరారు.