పరిగి, మే 20 : కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.వెంకటయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ పేర్కొన్నారు. కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం పరిగిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాల ఆధ్వర్యంలో మే 20వ తేదీన నిర్వహించే సమ్మెను పహల్గాం ఉగ్రదాడులతో ఉద్రిక్త వాతావరణం వల్ల జూలై 9వ తేదీన నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు.
పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు రద్దు చేసి యజమానులకు అనుకూలంగా నాలుగు కార్మిక కోడ్లు కేంద్రం తీసుకొస్తుందని విమర్శించారు. ఆశా, మధ్యాహ్న భోజన, అంగన్వాడీలు, గ్రామపంచాయతీ తదితర రంగాల కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలన్నారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ యూనియన్ల నాయకులు వెంకట్రాములు, హబీబ్, రఘురాం, విజయ్, అలీ, రాములు, బాలయ్య, నాయకురాళ్లు కె.నర్సమ్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.