నవాబ్‌పేట్ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టిపీడిస్తుందని, రైతుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ నేతలు, గ్రామాల రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ట్రిపుల్ఆర్ భూ నిర్వాసితుల ఆందోళన నేపథ్యంలో సోమవారం ఉదయం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని అయ్యవారిపల్లి, భీమారం గ్రామాలకు చెందిన నేతలు వీరేశం, శివలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏళ్ల తరబడి భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న పేద రైతుల పొట్టను కొట్టేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని విమర్శించారు. కనీసం నిరసన తెలిపే స్వచ్ఛను కూడా ఇవ్వకుండా అరెస్టులతో బెదిరింపులకు దిగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ ఏ ఆందోళన చేసిన ముందస్తుగానే అరెస్టులను చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని వాపోయారు. ట్రిపుల్ఆర్ భూ నిర్వాసితులకు అండగా ఉంటామని, వారికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై పోరాడుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.