Bridges | మేడ్చల్, మే 29 : ఏండ్ల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. భారీ వర్షాలకు ప్రతి ఏడాది మేడ్చల్ పట్టణ పరిధిలోని రెండు రోడ్లలో రాకపోకలు బంద్ అవుతున్నాయి. ఒక్కోసారి మూడు నుంచి ఐదు రోజుల వరకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టాపూర్ రోడ్డు, జ్యోతినగర్ మీదుగా గౌడవెల్లికి వెళ్లే రోడ్డు వర్షాకాలంలో మూసివేయాల్సి వస్తోంది. ఆ దారుల్లో ఉన్న కల్వర్టులపై నుంచి నీరు ప్రవహించి, రాకపోకలు బంద్ అవుతున్నాయి. ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి.
పదేళ్ల నుంచి..
మేడ్చల్-కిష్టాపూర్, మేడ్చల్-గౌడవెల్లి దారుల్లో వర్షాకాలం వచ్చిందంటే రాకపోకలు నిలిచిపోతున్నాయి. దాదాపు పదేళ్ల నుంచి వరుసగా వర్షాలు దంచి కొడుతుండటంతో ఆ దారుల్లో ఉన్న కల్వర్టులపై నుంచి నీరు ప్రవహిస్తోంది. మూడు నుంచి ఐదు రోజుల వరకు రోడ్లను మూసివేయాల్సి వస్తుంది. మేడ్చల్ నుంచి గౌడవెల్లికి జ్యోతినగర్ మీదుగా గౌడవెల్లితోపాటు దుందిగల్, గండిమెసమ్మ, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ తదితర ప్రాంతాలకు పాత పట్టణం నుంచి వెళ్తే చాలా దగ్గరగా ఉంటుంది. వర్షాలు పడితే పెద్ద చెరువులోకి పై నుంచి వరద నీరు వస్తోంది. ఆ వరదతో నీరు రోడ్డుపై నుంచి నీరు ప్రవహించి జనజీవనానికి ఆటంకం కలుగుతుంది. నీళ్లు వచ్చినప్పుడు ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి.
యువకులు రోడ్డు దాటేందుకు ప్రయత్నించి, ప్రమాదాల బారిన పడుతున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. రాకపోకలకు ఆటంకం ఏర్పడితే గౌడవెల్లి నుంచి మేడ్చల్‌కు రావడానికి ప్రయాణానికి మూడు కిలో మీటర్ల దూరంగా.. 8 కిలో మీటర్ల వరకు ప్రయాణించాల్సి వస్తోంది. గౌడవెల్లి నుంచి మేడ్చల్-గడిమైసమ్మ దారికి చేరుకొని, అక్కడి నుంచి పారిశ్రామిక వాడ మీదుగా మేడ్చల్‌కు చేరుకోవాల్సి వస్తోంది. కాగా మేడ్చల్-కిష్టాపూర్ దారిలో ప్రతి రోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. శామీర్‌పేట మండలంలో ఉన్న రాజీవ్ రహదారిని చేరుకోవడానికి అనువైన దారి ఇది. ప్రతీ రోజు మేడ్చల్‌కు వచ్చే పూడూరు, కిష్టాపూర్, ఘనపూర్, రాజబొల్లారం, రాజబొల్లారం తండా, మునీరాబాద్, గోసాయిగూడ తదితర ప్రాంతాల నుంచి మేడ్చల్‌కు వచ్చే వారు ఈ దారినే ప్రధానంగా వినియోగిస్తున్నారు.
పెద్ద చెరువు అలుగెళ్లిన ప్రతిసారి కిష్టాపూర్ దారిలో ఉన్న కల్వర్టుపై నుంచి నీళ్లు ప్రవహించి, రాకపోకలు నిలిచిపోతున్నాయి. రాకపోకలు నిలిచిపోతే మేడ్చల్ పారిశ్రామికవాడ మీదుగా లేదంటే వినియోగంలో లేని ప్రశాంతి వెంఛర్ మీదుగా కేఎల్ఆర్-ఎన్జేఆర్నగర్కు చేరుకొని, మేడ్చల్‌కు రావాల్సి వస్తుంది. ఇందుకోసం ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. పారిశ్రామికవాడ మీదుగా వెళ్తే నాలుగైదు కిలో మీటర్ల దూరం అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. ప్రశాంతి వెంఛర్ మీదుగా వస్తే సక్రమంగా లేని డ్రైనేజీ ప్రవహిస్తున్న రోడ్లపై నుంచి రావాల్సి వస్తుంది. ఈ దారిలో భారీ వాహనాలు రావడానికి వీలులేని పరిస్థితి ఉంది. ప్రజా ఇబ్బందులను గుర్తించి, రెండు దారుల్లో వంతెనలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
వంతెన నిర్మించాలి : అప్పమ్మగారి జగన్ రెడ్డి, మాజీ సర్పంచ్, గౌడవెల్లి
గౌడవెల్లి-మేడ్చల్ దారిలో వంతెన నిర్మించాలి. వర్షాలు అధికంగా పడితే వరద నీరు కల్వర్టు మీదుగా ప్రవహించి, రాకపోకలు బంద్ అవుతున్నాయి. చాలా ఏండ్ల నుంచి వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. రాకపోకలు బంద్ అయినప్పుడల్లా పక్కనే ఉన్న మేడ్చల్‌కు రావడానికి చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. నాలుగైదు కిలో మీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. వంతెన నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది.
ఇబ్బంది పడుతున్నాం : వినోద్‌కుమార్, పూడూరు
ప్రతి వర్షాకాలంలో ఇబ్బందులు తప్పడం లేదు. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి రాకపోకలు బంద్ అవుతున్నాయి. ఒక్కో సారి ఒకే వర్షాకాలంలో రెండు, మూడు సార్లు కూడా రాకపోకలు బందైన రోజులు ఉన్నాయి. బంద్ అయినప్పుడల్లా పారిశ్రామిక వాడ మీదుగా వెళ్లాలన్నా, పక్కన వెంఛర్ మీదుగా వెళ్లాలన్న అసౌకర్యంగా ఉంటుంది. తిరిగి రోడ్డు క్లియర్ కావడానికి రెండు, మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు పడుతుంది. పాలకులు వంతెన చర్య తీసుకోవాలి.
PM Modi | ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారికి ఆపరేషన్ సిందూర్ తగిన సమాధానం : ప్రధాని మోదీ
Sunkishala | సిటీకి సుంకిశాలే శరణ్యం.. కేసీఆర్ దిశలోనే కాంగ్రెస్ సర్కారు
Navy plane Crashes | ఘోర ప్రమాదం.. కూలిన నేవీ విమానం